Begin typing your search above and press return to search.

ఇద్ద‌రి కంటే ఎక్కువ పిల్ల‌లుంటే ఉద్యోగానికి నో

By:  Tupaki Desk   |   10 April 2017 7:06 AM GMT
ఇద్ద‌రి కంటే ఎక్కువ పిల్ల‌లుంటే ఉద్యోగానికి నో
X
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు వున్న వారు ప్రభుత్వ ఉద్యోగాలతో సహా ఇతర ప్రభుత్వ ప్రయోజనాలన్నింటికీ అనర్హులుగా అస్సాం ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే విశ్వ విద్యాలయ స్థాయి వరకూ రాష్ట్రంలోని బాలికలకు ఉచిత విద్యను అందిస్తామని తెలిపింది. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ ' ఇక నుంచి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు వున్న వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు' అని తెలిపారు. అంతే కాకుండా ఇళ్లు, ట్రాక్టర్లు మంజూరు తదితర ప్రభుత్వ ప్రయోజనాలన్నీ కూడా ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికి లభించవని మంత్రి పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధ్వర్యంలో జరిగే పంచాయితీ, మున్సిపల్‌ .. తదితర అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అనర్హులుగా మంత్రి తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాలు, ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని బిస్వా శ‌ర్మ చెప్పారు. ఈ విధానంపై ప్రజల నుంచి జూలై వరకు అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తామని, అనంతరం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతామని వివరించారు. రాష్ట్రంలో బాలికలందరికీ విశ్వవిద్యాలయ స్థాయి వరకూ ఉచిత విద్యను అందిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి కూడా అయిన శర్మ ప్రకటించారు. ఫీజులు, రవాణా, పుస్తకాలు, హస్టల్‌లో భోజనాలతో సహా అన్ని సౌకర్యాలు అమ్మాయిలకు ఉచితంగా అందచేస్తామని మంత్రి తెలిపారు. డ్రాపౌట్లు తగ్గించడానికి ఇది ఉపయోగ పడుతుందని భావిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లుగా ఉన్న వివాహ వయస్సును పెంచే ఆలోచన వున్నట్లు మంత్రి తెలిపారు. బాల్య వివాహం ఆరోపణలు ఎదుర్కొన్న వారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా మంత్రి తెలిపారు. అలాగే మహిళలపై వేధింపులు, దాడుల నిరోధక చట్టాలను మరింత కఠినతరం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/