Begin typing your search above and press return to search.

సినిమాలా.? రాజకీయాలా.? కమల్ చెప్పేశాడు..

By:  Tupaki Desk   |   1 July 2018 1:35 PM IST
సినిమాలా.? రాజకీయాలా.? కమల్ చెప్పేశాడు..
X
మెగా స్టార్ చిరంజీవి సినిమాలు వదిలేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లారు. కానీ అక్కడ హిట్ కాక మళ్లీ సినిమాల బాటపట్టారు. ఇప్పుడు తమిళనాట కమల్ హాసన్ కూడా అదే సంధి పరిస్థితిలో ఉన్నారు. అమ్మ జయలలిత మరణంతో తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ లోటు భర్తీ చేయాలని ఇటీవల కమల్ హాసన్ పార్టీ పెట్టారు. ఇప్పటికే ఓ విడత ప్రచారం పూర్తి చేశారు. కానీ ఇప్పటికైతే సినిమాలకు కమల్ దూరంగానే ఉన్నారు. తమ ఆరాధ్య హీరో రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలూ చేయాలని మెజారిటీ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది అంత సులువు కాదని కమల్ మాటలను బట్టి తెలిసింది.

కమల్ హాసన్ ఈరోజు ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని కమల్ ను పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు.‘సత్యజిత్ రే, శ్యామ్ బెనగల్ లతో పనిచేసే అవకాశం మీకు దక్కలేదా.? సత్యజిత్ రే ఒక పాత్రకు మిమ్మల్ని అడిగినట్టు ఎక్కడో చదివానని.. ఇది నిజమేనా.?’ అని ప్రశ్నించాడు. దీనికి కమల్ బదులిస్తూ ‘సత్యజిత్, శ్యామ్ బెనగల్ ఇద్దరితోనూ తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధమే ఉందని చెప్పాడు. ఐతే వాళ్లిద్దరిలో ఎవ్వరూ తనకూ క్యారెక్టర్ ఇవ్వలేదన్నాడు.’’ అందుకే వారితో కలిసి సినిమా చేసే అవకాశం రాలేదన్నాడు.

ప్రస్తుతం సత్యజిత్ మన మధ్య లేరని.. భవిష్యత్తులో తనకు సినిమాలు చేసే ఉద్దేశం లేదని కమల్ స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యే కొన్ని నెలల ముందు నుంచి సినిమాలకు పూర్తిగా దూరమై రాజకీయాల్లోనే ఉంటానని కమల్ స్పష్టం చేశాడు