Begin typing your search above and press return to search.

గొర్రెకుంట ఘటన : 10 మందిని చంపి నిబ్బరంగా పోలిసుల ముందు నిలబడ్డ సంజయ్ !

By:  Tupaki Desk   |   27 May 2020 6:30 AM GMT
గొర్రెకుంట ఘటన : 10 మందిని చంపి నిబ్బరంగా పోలిసుల ముందు నిలబడ్డ సంజయ్ !
X
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని గన్నీ సంచుల గోదాం ఆవరణలోని బావిలో వెలుగుచూసిన హత్యల ఉదంతానికి సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యల తర్వాత నిందితుడు సంజయ్‌ లో ఎక్కడా ఎలాంటి బెరుకు కనిపించలేదు. మొదట అతన్ని పోలీసులు ప్రశ్నించినా జంకకుండా.. ఏ తప్పు చేయనట్టు జవాబు చెప్పాడు. అయితే, సీసీటీవీ ఫుటేజీ,మక్సూద్ ఆలంలో ఇంట్లో మాయమైన వస్తువుల ఆధారంగా దర్యాప్తు చేయగా ఎట్టకేలకు సంజయ్ దొరికిపోయాడు.

గత బుధవారం మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఆలం మూడేళ్ల కుమారుడు బబ్లూ బర్త్ డే పార్టీకి సంజయ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ముందే వెంట తీసుకొచ్చిన నిద్ర మాత్రలను విందు కోసం వండిన ఆహార పదార్థాల్లో కలిపాడు. అందరూ భోజనం చేశాక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అనంతరం మక్సూద్ భార్య నిషా ఆలంను మొదట బావిలో పడేశాడు. రఫీకా ఆచూకీ గురించి ఆమె తనను పదేపదే నిలదీయడం... పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో.. మొదట ఆమెనే హత్య చేసినట్టు తెలుస్తోంది.

నిషా ఆలం తర్వాత వరుసగా బుష్రా,బబ్లూ,సోహెల్,షాబాజ్,మక్సూద్,షకీల్,శ్యామ్ ‌లను సంజయ్ బావిలో పడేశాడు. చివరగా శ్రీరామ్‌ ను కూడా బావిలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు గన్నీ సంచుల ఫ్యాక్టరీ యజమాని సంజయ్ ‌కి ఫోన్ చేయగా అక్కడికి వచ్చాడు. మక్సూద్ కుటుంబం ఆచూకీ కనిపించట్లేదని చెప్పగా.. ఏమీ తెలియనట్టు అతనితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాడు. పోలీసులు సంజయ్‌ ని ప్రశ్నించినప్పుడు ఎలాంటి బెరుకు లేకుండా తనకేమీ తెలియదన్నట్టుగా సమాధానాలు చెప్పాడు. అతని ధైర్యం చూసి పోలీసులు కూడా అనుమాన పడలేదు.

దీంతో ఇక తాను సేఫ్ అని అనుకున్నాడు. ఆ మృతదేహాలను వెలికి తీస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. కానీ ,చివరకు సీసీటీవీ ఫుటేజీలో దొరికిన ఆధారాలు,అలాగే మక్సూద్ ఇంట్లో బర్త్ డే పార్టీ రోజు మాయమైన వస్తువులు స్తంభంపల్లిలోని సంజయ్ ఇంట్లో దొరకడంతో అతనే నిందితుడని తేల్చారు. విచారణలో నేరం అంగీకరించడంతో హత్యల మిస్టరీ వీడిపోయింది. సంజయ్‌ ను ఈ మంగళవారం జిల్లా న్యాయ సేవా సదన్‌ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరంగల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎ.కుమారస్వామి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి సంజయ్ ‌కి వచ్చే నెల 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో సంజయ్‌ ని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.