Begin typing your search above and press return to search.

రద్దు ఎఫెక్ట్: లెక్క చూసుకున్నోళ్లందరికి షాక్

By:  Tupaki Desk   |   27 Nov 2016 5:30 PM GMT
రద్దు ఎఫెక్ట్: లెక్క చూసుకున్నోళ్లందరికి షాక్
X
ఒకట్రెండు రోజులు అటుఇటుగా చూస్తే 20 రోజులవుతోంది ప్రధాని మోడీ పెద్దనోట్లను రద్దు చేసింది. ఈ నెల 8న రాత్రి వేళ ప్రకటించిన మోడీ నిర్ణయం విన్న వెంటనే నోటి వెంట మాట రాని పరిస్థితి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఒక్క క్షణం అవాక్కు అయిన పరిస్థితి. కొద్దిసేపు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఏం జరుగుతుంది? రద్దు పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించటానికే కాస్తంత టైం పట్టిందనే చెప్పాలి.

అలా షాక్ తో మొదలైన రద్దు ఎపిసోడ్.. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా సాగుతోంది. స్టిల్ ఈ రోజుకీ రద్దు ఎఫెక్ట్ కంటిన్యూ అవుతోంది. ఈ రోజుకు ఏటీఎంలు పని చేయకపోవటం.. బ్యాంకుల వద్ద భారీ క్యూ ఉండటం కనిపిస్తోంది. చేతిలో డబ్బులు అవసరమైన వారంతా బ్యాంకు వద్దకు.. ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లటం.. అక్కడ డబ్బుల్లేకపోవటం.. ఒకవేళ ఉన్నా..డ్రా చేసుకునేందుకు గంటల కొద్దీ టైం వెయిట్ చేయాల్సి రావటం చికాకులు పెడుతోంది.

బ్యాంకుల నుంచి నోట్లు తెచ్చుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆ నోట్లల్లో రూ.2వేల నోట్లు కానీ ఉంటే వాటిని చిల్లర నోట్లుగా మార్చుకోవటానికి కిందామీదా పడాల్సి వస్తోంది. ఈ సందర్భంగా మోడీ నిర్ణయాన్ని తిట్టుకుంటున్నోళ్లు ఎంతో మంది. రద్దునిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన వారు సైతం.. బ్యాంకు క్యూలలో.. ఏటీఎం సెంటర్ల వద్దా గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం తమ చికాకును.. అసహనాన్ని మాటల రూపంలో వ్యక్తం చేయకుండా ఉండలేకపోతున్నారు.

రద్దు ఎపిసోడ్ లో ఇదో కోణమైతే.. చాలామంది గమనించని మరో కోణం ఇందులో దాగి ఉంది. అదేమిటంటే.. రద్దు తర్వాత ప్రతి ఒక్కరి ఖర్చులోనూ విపరీతమైన మార్పు వచ్చేంది. రోజుకు వంద ఖర్చు పెట్టేవారు పది.. ఇరవైతో సరిపెట్టుకుంటుంటే.. రోజుకు ఐదారు వందల ఖర్చు పెట్టే వారు.. వారానికి కూడా ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టకుండా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఒక్కరికో కాదు. నూటికి 98 శాతం మంది ఇలాంటి పనేచేస్తున్నారు.

చేతిలో ఉన్న డబ్బులు అయిపోతే.. బ్యాంకుల చుట్టూ తిరగటానికి.. క్యూలలో నిలుచోవటం కష్టంగా మారటమేకాదు.. దాని కారణంగా ఆఫీసులకు ఆలస్యంగా వెళ్లటమో.. సెలవు పెట్టాల్సి రావటమో జరుగుతోంది. దీంతో.. చేతిలో ఉన్నడబ్బుల్ని ఆచితూచి ఖర్చుపెడుతున్నారు. గతంలో వంద రూపాయిల నోటును సింఫుల్ గా ఖర్చు పెట్టేసే వారు సైతం.. ఇప్పుడు అదే వంద రూపాయిల్ని అపురూపంగా చూసుకుంటూ ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. దీంతో.. నెలాఖరుకు వచ్చేసరికి బ్యాంకు బ్యాలెన్స్ లు పూర్తిగా అయిపోకుండా ఉండటం.. బ్యాంకులో ఉన్న అమౌంట్ చూసుకొని మురిసిపోతున్న వారెందరో. బ్యాంకులో నగదును డ్రా చేసుకున్న వారు సైతం.. చేతిలో ఉన్న ఖర్చు.. గడిచిన 20 రోజుల్లో పెట్టిన ఖర్చును లెక్క పెట్టుకున్న వారంతా.. ఖర్చుబాగా తగ్గిపోయిందే అనుకునే పరిస్థితి. నోట్ల రద్దుతో ఇబ్బందులు పడినా.. నెలాఖరు సమయంలో మాత్రం చేతుల్లోనో.. బ్యాంకుల్లో క్యాష్ ఉండటం ఇప్పుడు చాలామందిని సంతోషానికి గురి చేయటమేకాదు.. ఖర్చుల్ని ఇలా అదుపు చేసుకోవచ్చా? అని అనుకుంటున్నోళ్లు పెరుగుతున్నారు. కావాలంటే.. మీ చుట్టుపక్కల ఉన్న వారితో ఇదే విషయాన్ని మాట్లాడండి.. ఆశ్చర్యపోయే విషయాలు మీకు తెలీయటం గ్యారెంటీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/