Begin typing your search above and press return to search.

సందేహం: కబడ్డీకి ఓట్లు రాలవేమో?

By:  Tupaki Desk   |   28 Oct 2016 9:54 AM IST
సందేహం: కబడ్డీకి ఓట్లు రాలవేమో?
X
భారత దేశంలో జనాభా 120కోట్లపైనే! కానీ ఒలింపిక్స్ లో వచ్చేవి రెండంటే రెండు పథకాలే. క్రికెట్ విషయం అంటారా... భారత్ దాదాపు ప్రపంచాన్ని శాసిస్తోందనుకోండి! జాతీయ క్రీడ విషయానికొస్తే ప్రోత్సాహంపై చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. క్రీడ ఏదైనా సరే... ప్రపంచ కప్ గెలవడం అంటే అది చిన్న విషయం కాదు. అది క్రికెట్ అయినా, ఫుట్ బాల్ అయినా - హాకీ అయినా మరేదైనా. కానీ ఇండియాలో కబడ్డీ కి ఆదరణ లేదా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదా.. లేక ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయాలైనా ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకునే చేస్తాయి అనే విమర్శకు బలమా.. ఏమో కానీ తాజాగా ప్రపంచ కప్ గెలిచిన కబడ్డీ జట్టుకు అందిన ప్రోత్సాహకాలు - ఆర్ధికపరమైన మద్దతూ అంతతమాత్రమే అనే కన్నా... అసలు లేదనే చెప్పాలి!

కేవలం ఒలిపింక్స్ జరిగే నాలుగు రోజులే భారతదేశంలో క్రీడలపై తెగ చర్చలు జరుగుతాయి. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, యువత ముందుకురావాలని అనర్గలంగా ప్రసంగాలు వినిపిస్తుంటాయి. కానీ... క్రికెట్ మినహా - ఒలింపిక్స్ విన్నర్స్ మినహా మిగిలిన ఆటలకు ప్రోత్సాహం ఏది? మొదట్లో సరే... కనీసం ప్రపంచ కప్ గెలిచాకైనా వారిని చూసేవారేరి. ప్రస్తుతం ఈ పరిస్థితినే ఎదుర్కొంటుంది ఇండియన్ కబడ్డీ జట్టు. గత కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రపంచ కప్ కబడ్డీ పోటీలను.. ఆ ఆట గురించి తెలిసిన వారూ తెలియని వారూ కూడా చూశారంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఫైనల్ మ్యాచ్ సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది... అద్భుతమైన ఆసక్తిని అంతకు మించిన ఆనందాన్ని కలిగించిన మ్యాచ్ అది. అయితే ఈ స్థాయిలో ప్రపంచ కప్ గెలిచిన కబడ్డీ జట్టుకు అందిన నగదు బహుమతి అక్షరాలా రూ.10 లక్షల! అంటే ఒక్కొక్కరికి రూ.67 వేలన్నమాట.

అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కబడ్డీ జట్టుకు ఎలాంటి నగదు బహుమతిని ప్రకటించలేదు!! వాళ్లకు బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చేవాళ్లు లేరు.. టాప్ లెస్ కార్లలో వారిని వూరేగించేవారూ లేరు.. సన్మానించే సీఎంలూ కనబడలేదు.. మరో విషయం ఏమిటంటే... కబడ్డీని ఒలింపిక్స్‌ చేర్చాలన్న ప్రభుత్వ పెద్దలు కూడా వారిని పట్టించుకోలేదు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధుకు నగదు బహుమతుల రూపంలో దాదాపు రూ.13 కోట్లు రాగా - 2011 ప్రపంచకప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టులో ఒక్కో సభ్యుడికి రూ.1.3 కోట్లు అందింది. కానీ కబడ్డీ ఆటగాళ్లకే ఈ పరిస్థితెందుకు? ప్రపంచకప్ గెలిచిన జట్టుకు ట్విట్టర్ లో కంగ్రాట్స్ చెబితే సరిపోతుందా? ఆన్ లైన్ లో శుభాకాంక్షల వరకేనా కబడ్డీకి ఈ దేశంలో అందే ప్రోత్సాహం? కబడ్డీకి ఓట్లు రాలవనే ఆలోచనే ఈ పరిస్థితికి కారణమా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు.. క్రీడా మంత్రిత్వ శాఖ వారికి మాత్రమే తెలిసే విషయాలు... పాపం సామాన్యుడికి - కబడ్డీ క్రీడాకారుడికీ ఎలా తెలుస్తుంది.. సారీ కబడ్డీ!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/