Begin typing your search above and press return to search.

టీడీపీకి-వైసీపీకి తేడా లేకుండా పోయిందా ?

By:  Tupaki Desk   |   18 May 2021 8:08 AM IST
టీడీపీకి-వైసీపీకి తేడా లేకుండా పోయిందా ?
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి-అధికార ప‌క్షం వైసీపీకి తేడా లేకుండా పోయింద‌నే వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈ రెండు ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న నెటిజ‌న్లు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ మాట‌ల‌తో కాలం గ‌డుపుతోంద‌ని.. ఎక్క‌డా ఉద్య‌మాలు కానీ, కార్య‌క్ర‌మాలు కానీ.. నిర్వ‌హించే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో అధికారంలో ఉన్న వైసీపీ నేత‌లు కూడా ఏమీ చేయ‌లేక పోతున్నార‌ని.. అంటున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయ నేత‌ల నుంచి భ‌రోసా ఎంతో అవ‌స‌రం. ఆర్థికంగా.. ఆరోగ్య ప‌రంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్ర‌మంలో రాజ‌కీయ నేత‌లు త‌మ ద‌గ్గ‌ర‌కు రావాల‌ని.. త‌మ‌ను ఆదుకోవాల‌ని వారు ఆకాంక్షిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా అధికార పార్టీ నేత‌ల నుంచి ప్ర‌జ‌లు చాలానే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కానీ, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి కూడా ప్ర‌జ‌ల్లోకి రావ‌డం లేదు. కొంద‌రు మాత్రం మీడియా ముందుకు వ‌చ్చి.. మాట్లాడుతున్నారు. ప్ర‌భుత్వం ఇది చేస్తోంది.. అది చేస్తోంది.. అని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ మాత్రం కూడా చేయ‌డం లేదు. క‌రోనా భ‌యంతోనో.. లేక‌.. ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌నే ఆవేద‌న‌తోనో.. వారు మౌనంగా ఉంటున్నారు. దీంతో ప్ర‌జ‌లకు క‌నిపించ‌కుండా తిరుగుతున్నారు.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎలాగూ ఏమీ చేయ‌డం లేదు. గ‌తంలో అయితే.. ఇసుక, మ‌ద్యం వంటి అంశాల‌ను తీసుకుని ఆందోళ‌న చేసేది. అయితే.. ఇప్పుడు క‌రోనా నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉండ‌డంతో.. నేత‌లు ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీంతో ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడే నాయ‌కులు ఎవ‌రూ కూడా టీడీపీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. పార్టీ అధినేత స‌హా కొంద‌రు మాత్రం మీడియా ముందుకు వ‌చ్చి నాలుగు మాట‌లు అనేసి చాప చుట్టేస్తున్నారు త‌ప్ప‌.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న ఉంది.

ఇటీవ‌ల తిరుప‌తిలో జ‌రిగిన ఆక్సిజ‌న్ మ‌ర‌ణాల విష‌యంలో క‌మ్యూనిస్టులు ఆందోళ‌న‌కు సిద్ధ‌మైన‌ప్ప‌టికీ.. టీడీపీ నేత‌లు రాలేదు. ఇక‌, వైసీపీ ఎంపీ కూడా ప్ర‌భుత్వానికి అనుకూలంగా మాట్లాడి ముగించారు. ఏదేమైనా ఎన్నిక‌లు ఉన‌ప్పుడు నానా హ‌డావిడి చేస్తూ ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకునే నేత‌లు.. ఇప్పుడు ప్ర‌జ‌లు ఇంత అల్ల‌క‌ల్లోలంలో ఉంటే ఎవ‌రో ఒక‌రిద్ద‌రు త‌ప్పా బ‌య‌ట‌కు వ‌స్తోన్న ప‌రిస్థితి లేదు. దీంతో ఇక‌, టీడీపీకి, వైసీపీకి తేడా లేకుండా పోయింద‌నే విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల‌ జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.