Begin typing your search above and press return to search.

నోట్ బ్యాన్... భార‌త్ ప‌రుగును ఆప‌లేదుగా!

By:  Tupaki Desk   |   3 March 2017 4:11 AM GMT
నోట్ బ్యాన్... భార‌త్ ప‌రుగును ఆప‌లేదుగా!
X
దేశంలోని మొత్తం క‌రెన్సీలో 86 శాతం ఉన్న వెయ్యి - 500 రూపాయల నోట్ల‌ను ఉన్న‌ప‌ళంగా ర‌ద్దు చేయ‌డం ద్వారా... దేశాభివృద్ధి స్తంభించిపోతుందని, ఇప్ప‌టికే స్తంభించిపోయింద‌ని కూడా విప‌క్ష రాజ‌కీయ పార్టీల‌తో పాటు పేరు మోసిన ఆర్థిక వేత్త‌లు కూడా నెత్తీ నోరు బాదుకున్నారు. అయినా మా జేబుల్లోని డ‌బ్బును కూడా ఎలా ఖ‌ర్చు పెట్టాలో మీరెలా చెబుతార‌ని మ‌ధ్య త‌ర‌గ‌తి - ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి జ‌నం న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. పెద్ద నోట్లు ర‌ద్దైపోయి ఈ నెల 8 నాటికి నాలుగు నెల‌లు కానుంది. మ‌రి ఈ 4 నెల‌ల కాలంలో విప‌క్షాలు చెప్పిన‌ట్లుగా దేశాభివృద్ధి ఎక్కడైనా ఆగిందా? లేదంటే దేశంలోని కీల‌క రంగాలేమైనా కుదేల‌య్యాయా? స‌గ‌టు జీవికి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదా? అంటే ఈ ప్ర‌శ్న‌ల్లో ఏ ఒక్క దానికి కూడా ఔన‌నే స‌మాధానం రాదు.

ఎందుకంటే... పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఎలాంటి మార్పు రాలేదు. దేశాభివృద్ధిలోని ఏ ఒక్క రంగమూ స్తంభించ‌లేదు క‌దా... క‌నీసం ఓ చిన్న కుదుపున‌కు కూడా గురి కాలేదు. ఓ నెల‌న్న‌ర పాటు స‌గ‌టు జీవి న‌గ‌దు చేతిలో లేక క‌ష్టాలు ప‌డ్డాడు త‌ప్పించి... ఇక ఏ త‌ర‌హా న‌ష్ట‌మూ జ‌ర‌గలేదు. ఇదేదో ప్ర‌భుత్వ అనుకూల మీడియానో, లేదా అధికార పార్టీకి చెందిన నేత‌లో చెబుతున్న మాట ఎంత‌మాత్రం కాదు. ప్ర‌పంచ దేశాల ఆర్థిక స్థితిగ‌తుల‌ను బేరీజు వేసి... ఆయా దేశాల ఆర్థికాభివృద్ధి ఏ దిశ‌గా సాగుతుందో విశ్లేషించే అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి సంస్థ‌. అదేనండి మ‌న‌మంతా ఐఎంఎఫ్‌గా పిలుచుకునే ఇంట‌ర్నేష‌న‌ల్ మానీట‌రీ ఫండ్. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత తొలి ఆరు నెల‌ల్లో భార‌త‌ జీడీపీ 6 శాతంగా న‌మోద‌వుతుంద‌ని ఐఎంఎఫ్ అంచ‌నా వేసింది. అయితే ఐఎంఎఫ్ అంచ‌నాల‌ను మించిన జీడీపీ... నోట్ల ర‌ద్దుకు ముందు న‌మోదైన 7 శాతంతోనే ముందుకు సాగుతోంద‌ట‌.

అంటే... పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశాభివృద్ధి ఎక్క‌డ కూడా ఆగిన దాఖ‌లా లేద‌న్న మాటేగా. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌తి త్రైమాసికంలో జీడీపీలో 7 శాతం వృద్ధి న‌మోదు కాగా... పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత కూడా ఆదే రీతిన 7 శాతం వృద్ధి న‌మోదైంది. దీంతో పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావం దేశాభివృద్ధిపై ఏమాత్రం లేద‌ని గ‌ణాంకాలే చెబుతున్నాయి. అంతేకాకుండా... ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఆర్థిక వేత్త‌లు చెబుతున్న భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావం కార‌ణంగా త‌న ప‌రుగులో ఏమాత్రం మార్పు లేకుండానే అభివృద్ధి ప‌థాన దూసుకుపోతోందని చెప్ప‌క త‌ప్ప‌దు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌ట్టాలు త‌ప్పుతుంద‌ని తెగ ఇదైపోయిన వారి భ‌యాలు కూడా ప‌టాపంచ‌లైపోయాయ‌నే చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/