Begin typing your search above and press return to search.

మ‌నోళ్ల‌కు పెద్ద రిలీఫ్:ఆ వీసా కొలువుల‌ను ఊడ‌బీక‌ట్లేదు

By:  Tupaki Desk   |   20 May 2018 5:00 AM GMT
మ‌నోళ్ల‌కు పెద్ద రిలీఫ్:ఆ వీసా కొలువుల‌ను ఊడ‌బీక‌ట్లేదు
X
అమెరికాలోని మ‌నోళ్ల‌కు పెద్ద ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. కొద్దికాలంగా టెన్ష‌న్‌ పెట్టిస్తున్న అంశానికి తెర‌ప‌డింది. నిబంధనల క్రమం పూర్తయ్యేవరకు హెచ్‌-4 వీసాలపై తుది నిర్ణయం తీసుకునేది లేదని సీనియర్‌ అధికారి ప్రకటించారు. హెచ్‌–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (భర్త లేదా భార్య) హెచ్‌–4 వీసాలను మంజూరు చేస్తారని విష‌యం తెలిసిందే. హెచ్‌–4 వీసా కలిగిన వారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు 2015లో నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అనుమతులిచ్చారు. ప్రస్తుతం దాదాపు 70 వేల మందికి పైగా భారతీయులు హెచ్‌–4 వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, అమెరికాలో హెచ్‌–4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు (వర్క్‌ పర్మిట్స్‌) రద్దు చేయాలని ఇటీవ‌ల ట్రంప్ ప్ర‌భుత్వం ప్రతిపాదించింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుండ‌టం తెలిసిన విష‌య‌మే. అయితే తాజాగా అమెరికా అధికారులు పెద్ద రిలీఫ్ ఇచ్చే ప్ర‌క‌ట‌న చేశారు.

అమెరికా కాంగ్రెస్‌ కు చెందిన కాంగ్రెస్స‌న‌ల్ రీసెర్స్ స‌ర్వీసెస్ విడుద‌ల చేసిన తాజా నివేదిక ప్ర‌కారం మొత్తం వీసాల్లో 93శాతం భార‌తీయుల‌వే. ఐదు శాతం మ‌న పొరుగు దేశ‌మైన చైనావి. మ‌న‌దేశానికి చెందిన 93%లో మెజార్టీ మ‌హిళ‌ల‌వే కావ‌డం విశేషం. ఇక మొత్తం 94% వీసాదారుల్లో 5వంతు కాలిఫోర్నియాలోనే నివ‌సిస్తున్నారు. 28033 మంది భార‌తీయులు ఇక్క‌డ ఉండ‌గా ఆ త‌దుప‌రి స్థానాల్లో టెక్సాస్‌, న్యూజెర్సీ ఉన్నాయి. హెచ్‌4 కేట‌గిరీ కింద మొత్తం 1,26,853 వీసాలకు యూఎస్ సిటిజ‌న్‌ షిప్ ఆండ్ ఇమ్మిగ్రేష‌న్ ఆమోదం తెలిపింది. ఇంత భారీగా భార‌తీయులు ల‌బ్ధిపొందుతున్న నిబంధ‌న‌ల‌ను ఎత్తివేయాల‌ని ట్రంప్ ఆదేశించ‌డంతో క‌ల‌కలం రేగింది.

దీంతో అమెరికాలో హెచ్‌1బీ వీసాదారుల భాగస్వాములు హెచ్‌ 4 వీసాపై పని అనుమతి పొందే విధానాన్ని తొలగించవద్దని అమెరికాలోని 130 మంది కాంగ్రెస్‌ సభ్యులు ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఇండో అమెరికన్‌ శాసన కర్త అయిన ప్రమీలా జైపాల్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. ఆ పత్రంపై 130 మంది కాంగ్రెస్‌ సభ్యులు సంతకాలు చేశారు. హెచ్‌1బీ వీసాపై పని చేస్తున్న ఉద్యోగుల భాగస్వాములకు పని అనుమతి ఉంచాలని, ఎంతో మంది ఐటీ ఉద్యోగులు ఈ విధానంతో లబ్ది పొందుతున్నారని ప్రమీలా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇటీవల అమెరికన్‌ సెక్రటరీ ఆఫ్‌ హౌంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారికి ఈ వినతి పత్రం అందజేశారు. కాగా , ఈ ప‌రిణామాల‌పై పేరు వెల్ల‌డించేందుకు ఇష్ట‌ప‌డ‌ని ఓ అధికారి స్పందిస్తూ ఇప్ప‌టివ‌ర‌కు హెచ్‌4 వీసాదారుల‌కు ఉద్యోగాలు చేసుకునే హ‌క్కును తొల‌గించే ప్ర‌తిపాద‌నపై తుది నిర్ణ‌యం ఇప్పుడే లేద‌ని ప్ర‌క‌టించారు.