Begin typing your search above and press return to search.

నోట్ల ప్రింటింగ్ కు ప్రాబ్లం లేదంట కానీ..

By:  Tupaki Desk   |   23 Nov 2016 9:45 AM GMT
నోట్ల ప్రింటింగ్ కు ప్రాబ్లం లేదంట కానీ..
X
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల సంగతి తెలిసిందే. ఓపక్క అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా.. సామాన్యుల పరిస్థితి మాత్రం ఏమాత్రం మార్పు లేని పరిస్థితి. క్యాలెండర్లో తేదీలు మారుతున్నా.. ఇప్పటివరకూ బ్యాంకుల వద్దా.. ఏటీఎంల వద్దా క్యూ బారుల్లో మాత్రం మార్పులు రావటం లేదు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ తీసుకున్న రద్దు నిర్ణయంపై పలువురు కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ తరహా ఫిర్యాదుల్ని విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా కేంద్రంపై కాస్తంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసి.. రద్దుపై వస్తున్న పిటీషన్లను విచారణకు ఓకే చెబుతోంది. తాజాగా.. ఈ అంశంపై దాఖలైన పిటీషన్లపై వాదనలు మొదలయ్యాయి. రద్దుపై కేంద్రం తరఫు వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. కేంద్రం తీసుకున్న చర్యల్ని ఏకరువు పెట్టారు.

నోట్ల రద్దు నిర్ణయం అనంతరం కేంద్రం చేపట్టిన చర్యల గురించి ఆయన వివరించే ప్రయత్నం చేశారు నోట్ల కొరత తీవ్రంగా ఉందన్న అంశంపైనా ఆయన సమాదానం ఇచ్చారు. ఈ సందర్భంగా నోట్ల కొరతకు అసలు కారణాన్ని ఆయన చెప్పటం గమనార్హం. నోట్లను ముద్రించే విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని .. ఆ తీరులో వస్తున్న వార్తల్లో నిజమే లేదని చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంకు.. ప్రభుత్వ ముద్రణాలయాలు ప్రజలకు అవసరమైన కరెన్సీని ముద్రిస్తున్నాయని.. సమస్య అంతా కరెన్సీని దేశ వ్యాప్తంగా పంపించే విషయంలోనే ఇబ్బంది ఎదురువుతుందని వెల్లడించారు.

ముద్రించిన కరెన్సీని.. బ్యాంకులు.. పోస్టాఫీసులకు రవాణా చేయటంలోనే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కేంద్రం తరఫు అటార్నీ జనరల్ అసలు విషయాన్ని వెల్లడించారు. అయితే.. ఆలస్యం జరగకుండా ఉండేలా.. కొత్త నోట్లను తరలించేందుకు చర్యలు చేపట్టామని.. నోట్ల కొరతపై ప్రజలు గాబరా పడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ నోట్ల కొరతపై ప్రభుత్వం కానీ.. పాలకులు కానీ సంతృప్తికరమైన సమాధానం చెప్పని పరిస్థితుల్లో.. అసలు విషయం ఏమిటన్నది సుప్రీంకోర్టు విచారణ పుణ్యమా అని బయటకు వచ్చిందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/