Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి రైతుల స‌భ‌కు సీపీఎం డుమ్మా.. రీజ‌న్ ఏంటి?

By:  Tupaki Desk   |   17 Dec 2021 4:30 PM GMT
అమ‌రావ‌తి రైతుల స‌భ‌కు సీపీఎం డుమ్మా.. రీజ‌న్ ఏంటి?
X
అమరావతి అందరిదీ అనే నినాదంతో.. రాజధాని ప్రాంత రైతులు.. చేస్తున్న 700 పైగా రోజుల ఉద్య‌మం లో తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహించారు. తిరుపతి వేదికగా జరిగిన 'అమరావతి పరిరక్షణ మహో ద్యమ సభకు  టీడీపీ, సీపీఐ, బీజేపీ స‌హా ఇత‌ర పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు. భావి తరాల భవిష్యత్తు, మన బిడ్డల బాగు కోసం అమరావతి నిర్మాణం అవసరమనే సందేశాన్ని సభ ద్వారా చాటారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు హాజరైన ఈ స‌భ‌ల మ‌రో విశేషం కూడా ఉంది.

అదేంటంటే.. ప్ర‌జా ఉద్య‌మాల్లో ఫ‌స్ట్ ఉండే.. సీపీఎం ఈ స‌భ‌కు డుమ్మా కొట్టింది. నిజానికి ఆది నుంచి కూడా సీపీఎం, సీపీఐలు అమ‌రావ‌తి రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఉద్య‌మం ప్రారంభ మైన  కొత్త‌లోనూ.. వారు అమ‌రావ‌తికి వెళ్లి రైతుల ప‌క్షాన ప్ర‌సంగించారు. అయితే.. ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన స‌భ‌కు మాత్రం సీపీఐ హాజ‌రుకాగా, సీపీఎం మాత్రం హాజ‌రుకాలేదు. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ వ‌చ్చి.. రైతుల ప‌క్షాన సంఘీభావం ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ చేస్తున్న‌ది ముమ్మాటికీ త‌ప్ప‌ని చెప్పారు. ఎప్ప‌టికైనా.. రైతులదే విజ‌య‌మ‌ని పేర్కొన్నారు.

అయితే.. ఈ స‌భ‌కు సీపీఎం నేత‌లు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా హాజ‌రు కాలేదు. ఈ స‌భ‌కు తాము రాలేక పోతున్నామ‌ని.. పేర్కొంటూ.. పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి పిన్నెల్లి మ‌ధు.. రైతుల జేఏసీకి ఒక లేఖ రాశారు. అయితే.. తాము ఎప్పుడూ.. రైతుల‌ప‌క్షానే ఉంటామ‌ని.. పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు  పేర్కొన్నారు. ``రైతులు చేప‌ట్టి స‌భ‌కు.. మా ప్ర‌త్య‌ర్థి.. బీజేపీ నేత‌లు వ‌స్తున్నారు. వారితో క‌లిసి వేదిక పంచుకోవ‌డం.. మా రాజ‌కీయ సైద్ధాంతిక‌త‌కు వ్య‌తిరేకం.. అందుకే మేం రాలేక పోతున్నాం`` అని మ‌ధు పేర్కొన్నారు.  

అయితే.. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. సీపీఐ త‌ర‌ఫున రామ‌కృష్ణ‌.. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌.. నారాయ‌ణ పాల్గొని ప్ర‌సంగించారు. అంతేకాదు.. బీజేపీత‌ర‌ఫున మాజీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పాల్గొన్నారు. ఈయ‌న ప‌క్క‌నే నారాయ‌ణ కూడా కూర్చొన్నారు. ఇద్ద‌రూ స‌ర‌దాగా చాలా సేపు వేదిక‌పైనే ముచ్చ‌టించుకున్నారు. మ‌రి వీరు కూడా క‌మ్యూనిస్టులే క‌దా..?  వీరికి మాత్రం సిద్ధాంతాలు లేకుండా ఉంటాయా? అనేది చ‌ర్చ‌నీయాంశం అయింది. ఏదేమైనా.. బీజేపీ వారు రేపు అధికారంలోకి వ‌స్తే.. వారు ఇచ్చే నీళ్లు.. పంచే రేష‌న్ వంటివి కూడా సీపీఎం నేత‌లు ముట్టుకోరా? అనే విమ‌ర్శ‌లువినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి రైతుల స‌భ‌కు రాజ‌కీయాల‌ను అంట‌గ‌ట్ట వ‌ద్ద‌ని హైఊకోర్టు కూడా పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ.. దీనిని సీపీఎం రాజ‌కీయ స‌భ‌గానే భావించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, అమరావతి పరిరక్షణ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ సీనియ‌ర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోనిబీజేపీ బృందం హాజ‌రైంది. కాంగ్రెస్ నుంచి తుల‌సిరెడ్డి, జనసేన నేత‌లు  కూడా సభకు హాజరయ్యారు. అదేవిధంగా తిరుపతి రైతుల సభకు న్యాయవాదులు తరలివచ్చారు.