Begin typing your search above and press return to search.

స్పీక‌ర్ టేబుల్ మీద‌కు జ‌గ‌న్ పార్టీ అవిశ్వాస తీర్మానం

By:  Tupaki Desk   |   16 March 2018 8:13 AM GMT
స్పీక‌ర్ టేబుల్ మీద‌కు జ‌గ‌న్ పార్టీ అవిశ్వాస తీర్మానం
X
ప్ర‌త్యేక హోదాతో పాటు ఏపీ విభ‌జ‌న హామీల అమ‌లు.. రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయాన్ని నిర‌సిస్తూ మోడీ స‌ర్కారుపై ఏపీ విప‌క్షం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం స్పీక‌ర్ టేబుల్ మీద‌కు చేరింది. శుక్ర‌వారం ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన త‌ర్వాత అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రిగే వీలుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విన‌తి మేర‌కు అవిశ్వాస తీర్మానంపై ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మ‌ద్ద‌తు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. హోదాపై జ‌గ‌న్ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి తాము మ‌ద్ద‌తు ప‌లుకుతామ‌ని చెప్పిన బాబు.. ఈ రోజు ఉద‌యానికి త‌న నిర్ణ‌యాన్ని మార్చేసుకొని తామే సొంతంగా అవిశ్వాసం పెడ‌తామ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. తాము పెడ‌తామ‌న్న అవిశ్వాస తీర్మానం నోటీసును ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లోక్ స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ స్నేహ‌ల‌తా శ్రీ‌వాస్త‌వ‌కు అంద‌జేశారు. మంత్రిమండ‌లిపై స‌భ అవిశ్వాసాన్ని వ్య‌క్తం చేస్తోంద‌ని నోటీసులో పేర్కొన్నారు.

నిబంధ‌న చాప్ట‌ర్ 17లోని 198(బి) రూల్ కింద తామీ తీర్మానాన్ని 2018 మార్చి 16న ప్ర‌వేశ పెట్టేందుకు నోటీసులు ఇస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. 2018 మార్చి 16 నాటి స‌భా కార్య‌లాపాల స‌వ‌రించిన జాబితాలో తాము అభ్య‌ర్థిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ విన‌తికి త‌గ్గ‌ట్లే ఈ రోజు స్పీక‌ర్ టేబుల్ మీద‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు వెళ్లాయి.

లోక్ స‌భ నిబంధ‌న మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాస‌ తీర్మానం నోటీసులు త‌న‌కు అందిన‌ట్లుగా స్పీక‌ర్ పేర్కొన్నారు. హౌజ్ అదుపులోకి వ‌స్తే ఆ అంశంపై చ‌ర్చ చేప‌డ‌తామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా.. వేర్వేరు డిమాండ్ల‌తో స్పీక‌ర్ పోడియంను చుట్టుముట్టిన కొన్ని రాజ‌కీయ ప‌క్షాలు నినాదం చేస్తున్న నేప‌థ్యంలో స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేశారు. దీంతో సోమ‌వారం మ‌రోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇవ్వ‌నున్నారు.

స‌భ సోమ‌వారానికి వాయిదా ప‌డిన నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఇప్పుడు ప‌లువురికి సందేహం గా మారింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ నోటీసులు మ‌ళ్లీ ఇచ్చిన ప‌క్షంలో.. నిబంధ‌న‌ల మేర తీర్మానం ఉంటే స్పీక‌ర్ టేబుల్ మీద‌కు చేరుతుంది. స‌భ కంట్రోల్ లో ఉంటే.. అవిశ్వాస తీర్మానాన్ని స‌భ‌లో చ‌దువుతారు. 50 మంది ఎంపీలు లేచి నిల‌బ‌డితే.. లెక్కించి దీనిపై చ‌ర్చ‌ను నిర్వ‌హిస్తారు. అయితే.. ఇదంతా జ‌ర‌గాలంటే స‌భ ఆర్డ‌ర్ లో ఉండాలి. మ‌రి.. సోమ‌వారం ఏమ‌వుతుందో చూడాలి.