Begin typing your search above and press return to search.

ఆంధ్రోడి దెబ్బ రుచేంటో మోడీకి తెలిసిందా?

By:  Tupaki Desk   |   17 March 2018 3:49 AM GMT
ఆంధ్రోడి దెబ్బ రుచేంటో మోడీకి తెలిసిందా?
X
అంతా నేనే. క‌నుసైగ‌తో శాసించే స్థితి నుంచి.. విభ్రాంతితో క‌ళ్ల‌ప్ప‌గించే ప‌రిస్థితి మోడీకి వ‌చ్చేసింది. అంతులేని ఆద‌ర‌ణ‌తో దూసుకెళుతున్న మోడీకి ఇటీవ‌ల కాలంలో ఎదురుదెబ్బ‌లు వ‌రుస‌గా త‌గులుతున్నాయి. జాతీయ‌స్థాయిలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్న పార్టీల‌తో పాటు.. విప‌క్షాలు ఒక‌జ‌ట్టుగా మారిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో.. జాతీయ రాజ‌కీయం ఒక్క‌సారిగా రాజుకుంది.

మోడీ స‌ర్కారుకు త‌మ మ‌ద్ద‌తును ఉప‌సంహ‌రించుకోవ‌ట‌మే కాదు.. అవిశ్వాసం ప్ర‌క‌టించ‌టం జాతీయ‌స్థాయిలో సంచ‌ల‌నంగా మారింది. ఎన్డీయేతో క‌టీఫ్ చెప్పిన చంద్ర‌బాబు.. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప‌లువురు అభివ‌ర్ణిస్తే.. బాబు పీడ త‌మ‌కు వ‌దిలిపోయిందంటూ ఏపీ బీజేపీ నేత‌లు పండుగ చేసుకోవ‌టం మ‌రో విశేషంగా చెప్పాలి.

నిజానికి ఈ ప‌రిస్థితికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని నిర్ణ‌యించ‌టం.. దీనికి ఏపీలో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించ‌టం.. మోడీ పేరెత్తితే ర‌గిలిపోతున్న నేప‌థ్యంలో బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. బాబు నిర్ణ‌యం వెనుక జ‌గ‌న్ ఎఫెక్ట్ ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

మోడీ స‌ర్కారుపై జ‌గ‌న్ పార్టీ పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి ఏపీలో పెద్ద ఎత్తున స్పంద‌న‌తో పాటు.. అధికార‌పక్షాన్ని వేలెత్తి చూపిస్తున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీంతో.. మోడీ స‌ర్కారుకు తామిస్తున్న మ‌ద్ద‌తు విష‌యంలో కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సిన అవ‌స‌రం బాబుకు ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ గ‌ళం విప్ప‌టంతో.. అనివార్యంగా మోడీకి టాటా చెప్పేసి.. అవిశ్వాసానికి రెఢీ అయిపోయారు.

ఏపీకి చెందిన అధికార‌.. విప‌క్షం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి జాతీయ స్థాయిలో స్పంద‌న రావ‌టం గ‌మ‌నార్హం. మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం త‌ప్ప‌నిస‌రిగా స్పందించి.. చ‌ర్చించాల్సిన అవ‌స‌రం రానున్న రోజుల్లో త‌ప్ప‌క వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేకంగా ఆంధ్రోళ్లు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానానికి జాతీయ‌స్థాయిలో వివిధ రాజ‌కీయ ప‌క్షాలు త‌మ సంఘీభావాన్ని ప్ర‌క‌టించాయి.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన రెండు ప్రాంతీయ పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్‌.. తృణ‌మూల్ కాంగ్రెస్‌.. వామ‌ప‌క్షాలు.. స‌మాజ్ వాదీ.. డీఎంకే.. జేడీఎస్.. శివ‌సేన‌.. డీఎంకే.. ఆర్జేడీ త‌దిత‌ర పార్టీలు మ‌ద్ద‌తు ప‌ల‌క‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రాంతీయ పార్టీలు మోడీకి తాజాగా షాకిచ్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.