Begin typing your search above and press return to search.

కొత్త రాజకీయానికి నో చాన్స్... ?

By:  Tupaki Desk   |   12 Oct 2021 7:00 PM IST
కొత్త రాజకీయానికి నో చాన్స్... ?
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పుకోవాలంటే ఒక శాపగ్రస్థగానే చూడాలి. దేశంలో ఏ రాష్ట్రానికి పట్టని అవస్థలు ఏపీకే పడుతున్నాయి. ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయిన దగ్గర నుంచి తీసుకుంటే ఉమ్మడి ఏపీ నుంచి వేరు పడినదాకా ఏపీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడింది అన్నది అందరికీ ఎరుకే. ఇక ఏడేళ్ల విభజన ఏపీలో ఆంధ్రులు మరింతగా దెబ్బ తిన్నారు. తొంబై వేల కోట్ల రూపాయల అప్పులతో ఏపీ ఏర్పడింది. చంద్రబాబు, జగన్ ఇద్దరూ చేసిన అప్పులతో ఇపుడు రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. ఏపీ ఏ రోజుకైనా ఎత్తిగిల్లుతుందా అంటే ఆర్ధిక నిపుణులు సైతం ధీమాగా జవాబు చెప్పలేకపోతున్నారు.

దీనికంతటికీ రాజకీయాలతో పాటు ముందు చూపు కొరవడడం ఆంధ్రులలో నెలకొన్న అనైక్యత వంటివి కూడా చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదాతో సహా అనేక విభజన హామీల మీద కేంద్రం చెప్పిన మాటలను అన్నీ తప్పేసింది. పైగా రెవిన్యూ లోటుని కూడా ఈ రోజుకీ తీర్చలేదు. ఈ నేపధ్యంలో ఏపీ అప్పులతో సతమతమవుతోంది. ఇక పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రంగానే ఏపీ ఉంది. అదే విధంగా కొత్త పరిశ్రమలు ఏవీ కూడా ఏపీకి రాలేదు, సమీప భవిష్యత్తులో వస్తాయన్న ఆశ లేదు.

ఇవన్నీ పక్కన పెడితే ఏపీ ప్రజలు తొలి అయిదేళ్ళూ చంద్రబాబుని అనుభవం అన్న కారణంతో ఎన్నుకున్నారు. తరువాత యువ నేత అని జగన్ కి పట్టం కట్టారు. ఇపుడు ఏపీలో కొత్త మార్పులు వస్తాయని ఈసారి పవన్ సీఎం అవుతారని జనసేనలో ఆశలు ఉంటే ఉండవచ్చు. కానీ మళ్ళీ మళ్లీ ఇలా ప్రయోగాలు ఏపీ జనాలు చేస్తారా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఏపీ ప్రజలు జగన్ ని సీఎం ని చేయడం ఒక ప్రయోగమే. ఆయన మంత్రిగా ఎవరి దగ్గరా పనిచేయలేదు, అయితే ఆయన రెండు సార్లు ఎంపీగా, అయిదేళ్ళు విపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉంది. రాజకీయంగా ఆయన రాటుదేలారు కూడా.

ఆయనతో పోలిస్తే పవన్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, పైగా ఆయన పూర్తిగా ప్రజా ప్రతినిధిగానే కొత్త అవుతారు. మరి ఆయన్ని తెచ్చి సీఎం ని చేయడానికి ఏపీ జనాలు ఈసారి సిద్ధంగా ఉన్నారా అంటే మేధావులు, రాజకీయ విశ్లేషకులు మాత్రం అదంత సులువు కాదు అనే అంటున్నారు. జగన్ సీఎం గా అనేక నిర్ణయాలు తీసుకున్నారు, ఇందులో కొన్ని భేష్ అని అందరూ మెచ్చుకునేలా ఉన్నా కొన్ని మాత్రం పాలనానుభవం లేకపోవడం వల్ల వివాదాస్పదం అయ్యాయని కూడా చెబుతారు. జగన్ ఏలుబడిలో సంక్షేమానికి పెద్ద పీట వేసి అభివృద్ధిని పక్కన పెడుతున్నారు అన్న చర్చ కూడా ఉంది. ఇక జగన్ సర్కార్ అనేక నిర్ణయాలను కోర్టులు కూడా కొట్టేస్తున్నాయి. ఇవన్నీ కూడా పాలనానుభవం లేకనే తేలిపోతున్నాయి అన్న చర్చ కూడా ఉంది.

దీంతో వచ్చే ఎన్నికల్లో కొత్త రాజకీయాన్ని ఏపీ జనాలు ఆహ్వానిస్తారా అన్న చర్చ అయితే గట్టిగా ఉంది అంటున్నారు. అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుతో పాటు, అయిదేళ్ళు పాలించిన జగన్ ల మధ్యనే ఏపీలో మరో మారు రాజకీయ సమరం సాగే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పొత్తులతో ముందుకు వస్తే బాగా ప్రభావం చూపించవచ్చు అన్నది కూడా ఒక విశ్లేషణ. అలా కాకుండా మూడవ ఆల్టరేషన్ అంటూ కనుక పోటీకి దిగితే రాజకీయంగా ఇబ్బందే అంటున్నారు. ఇప్పటిదాకా చూస్తే ఏపీలో టీడీపీ బీజేపీ, జనసేన కూటమి పోటీ చేయవచ్చు అన్న ప్రచారం అయితే ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి కనుక ముందుకు వస్తే మాత్రం అధికారం కోసం యుద్ధం హోరా హోరీగానే సాగుతుంది అన్న మాట కూడా ఉంది.