Begin typing your search above and press return to search.

రాత్రి అయితే ఎటీఎంల‌లో తెల్లారిన‌ట్లే!

By:  Tupaki Desk   |   20 Aug 2018 5:31 AM GMT
రాత్రి అయితే ఎటీఎంల‌లో తెల్లారిన‌ట్లే!
X
ఎనీ టైం మ‌నీ అన్న ట్యాగ్ తో జ‌న జీవితాల్లో భాగ‌మైన ఏటీఎంలు.. పెద్ద నోట్ల ర‌ద్దు నాటి నుంచి కొత్త క‌ష్టాలు పెట్ట‌టం మొద‌లైంది. ఏటీఎంల‌లో ఎప్పుడు డ‌బ్బులు ఉంటాయో.. ఎప్పుడూ మూత ఉంటుందో అర్థం కాని ప‌రిస్థితి. ఒక‌ప్పుడు ఎనీటైం మ‌నీ అన్న పేరున్న ఏటీఎంలు.. ఇప్పుడు ఎనీ టైం మూతేన‌న్న‌పేరును సొంతం చేసుకున్నాయి.

ఇదిలా ఉంటే..తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏటీఎంల‌కు సంబంధించి కొత్త ఆదేశాల్ని జారీ చేసిన వైనం ప‌లువురిని త‌ప్పు ప‌ట్టేలా చేస్తోంది. తాజా ఆదేశాల ప్ర‌కారం రాత్రి 9 త‌ర్వాత ఎటీఎంల‌లో న‌గ‌దును నింపొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక‌.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే.. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే న‌గ‌దు నింపే కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయాల‌ని చెబుతున్నారు.

న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతాల్లో అయితే.. ఏటీఎంలు సాయంత్రం 4 గంట‌ల లోపే నింపాల‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అదే జ‌రిగితే..సాయంత్రాలు ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండి ఏటీఎంల‌లోక్యాష్ అయితే.. వాటిని మ‌ళ్లీ నింపాలంటే ఉద‌యం వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణ‌యాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. అధికారికంగానే సాయంత్రం నాలుగు గంట‌లు.. ఆరు గంట‌ల వ‌ర‌కూ అని చెప్పిన నేప‌థ్యంలో అంత‌కు గంట ముందే సేవ‌లు నిలిచిపోతాయ‌ని.. అదే జ‌రిగితే.. ఏటీఎంల‌లో డ‌బ్బుల ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎటీఎంలో డ‌బ్బును ఉంచే ఏజెన్సీలు.. తాము డ‌బ్బును బ్యాంకు నుంచి ఏటీఎంల వ‌ర‌కూ చేర్చ‌టానికి పెద్ద ప్రోసీజ‌రే ఉంటుంది. ఇలాంటి నేప‌థ్యంలో తాజాగా పెట్టిన రూల్స్ ప్ర‌కారం.. సాయంత్రం అయితే ఏటీఎంలలో క్యాష్ ను ఫిల్ చేయొద్ద‌న్న నిబంధ‌న నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నం నుంచే ఏటీఎంల్లో డ‌బ్బు ఉంచే కార్య‌క్ర‌మాన్ని బంద్ చేస్తార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ మ‌ధ్యాహ్నం వేళ‌లో బ్యాంకుల నుంచి క్యాష్ తీసుకునే ఏజెన్సీలు.. తాజా నిబంధ‌న‌ల నేప‌థ్యంలో త‌మ వ‌ద్దే క్యాష్ ఉంచుకుంటే కొత్త మోసాల‌కు తెర లేచే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఏటీఎంల విష‌యంలో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌జ‌ల్ని మ‌రింత ఇబ్బందుల‌కు గురి చేసే అవ‌కాశం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.