Begin typing your search above and press return to search.

ఏపీలో నో కూటమి..!?

By:  Tupaki Desk   |   4 Jan 2019 1:02 PM IST
ఏపీలో నో కూటమి..!?
X
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సిపిఐ కలిసి మహాకూటమిగా పోటీ చేసిన సంగతి మరచిపోలేదు కదా.. ! అయినా ఎలా మరిచిపోతారు. మరచిపోవడానికి అదేమైనా మామూలు ఓటమా.... అగ్ర నేతలు, దేశంలోనే సీనియర్ నాయకుడు అని బీరాలు పోయిన నారా చంద్రబాబు నాయుడు అంతటి నాయకుడికి దిమ్మ తిరిగి ఓట్లు కనిపించిన ఎన్నికలు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని... ముఖ్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును గద్దె దించడమే లక్ష్యంగా ఏకం అయిన పార్టీలకు కళ్ల ముందే ఓటమి సినిమా చూపించిన ఎన్నికలు. అలాంటి ఎన్నికల్లో ఆగర్భ శత్రువుగా భావించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇది అపవిత్రమని, మహా నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు నందమూరి తారక రామారావు ఆత్మ క్షోభిస్తుందనిపార్టీ నాయకులు, అభిమానులు, తెలుగు తమ్ముళ్లు నెత్తీ నోరు మొత్తుకున్నా నారా వారు పెడచెవిన పెట్టారు. అందుకు తగిన ప్రతిఫలమే దక్కిందని వారంతా ఆనందంగా ఉన్నారనుకోండి. అది వేరే సంగతి. ఇప్పుడు మళ్లీ అదే సీన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా రిపీట్ చేయాలని నారా వారి మనసులో బలంగా ఉందట. ఇందుకోసం ఆయన ఎలాంటి ప్రయత్నాలకైనా వెనకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు వద్దని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగు తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారట. రాష్ట్రాన్ని నిలువునా ముంచినా పార్టీతో తెలంగాణలో పొత్తు వరకూ సరే అన్నామని, ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధానాన్ని అవలంభిస్తే మాత్రం సహించేది లేదని తెగేసి చెబుతున్నారట తమ్ముళ్లు. హోదా పేరుతో వారిని ఒప్పించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నా అది బెడిసికొడుతోందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉందంటున్నారు. తెలంగాణలో పార్టీ ఓటమికి చంద్రబాబు నాయుడితో చేతులు కలపడమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, ఈ దశలో వారితో చేతులు కలిపితే తీవ్ర నష్టం కలుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారట. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశంతో కలిసి పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. అంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒంటరి పోరు చేస్తుందని రాజకీయ పండితుతలు అంచనా వేస్తున్నారు.