Begin typing your search above and press return to search.

గాలిని మూట క‌ట్టే బ్యాచ్ ఎక్కువ‌య్యారే

By:  Tupaki Desk   |   11 Nov 2017 4:40 AM GMT
గాలిని మూట క‌ట్టే బ్యాచ్ ఎక్కువ‌య్యారే
X
మీడియా కానీ సోష‌ల్ మీడియా కానీ ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. లేకుంటే.. లేనిపోని న‌ష్టాలు రావ‌టం ఖాయం. అయితే.. బాధ్య‌త లేకుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. మ‌న‌సుకు తోచింది రాసేసే కొత్త పైత్యం ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇలాంటి తీరుతో వ‌చ్చే స‌మ‌స్యేమిటంటే.. అస‌లును కూడా న‌మ్మ‌ని ప‌రిస్థితిని తీసుకురావ‌టం.

గాలిని మూట‌క‌ట్టే బ్యాచ్ గొప్ప‌త‌నం ఏమిటంటే.. వారు చెప్పే మాట‌లు విన్నంత‌నే న‌మ్మేలా ఉండ‌టం. నిజ‌మేనా? అన్న క్రాస్ చెక్ చేసుకుంటే కానీ అస‌లు విష‌యం బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి. ఢిల్లీలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోయిన నేప‌థ్యంలో అక్క‌డ వాతావ‌ర‌ణ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించారు.ఈ వార్త‌కు ఉప వార్త కింద‌.. సోష‌ల్ మీడియాలో ఒక వార్త వైర‌ల్ అయ్యింది. ఢిల్లీ- ముంబ‌యి మ‌ధ్య విమాన‌ టికెట్ ధ‌ర‌లు ఒక్క‌సారిగా ఆకాశానికి అంటుతున్నాయ‌ని ఒక న్యూస్ స‌ర్కిలేట్ అయ్యింది.

బుధ‌.. గురువారాల్లో రూ.ల‌క్ష వ‌ర‌కూ విమాన టికెట్ ధ‌ర ట‌చ్ అయ్యింద‌న్న‌ది న్యూస్‌. ఇందులో నిజం ఎంత‌న్న‌ది చూస్తే.. ఉత్త గ్యాస్ త‌ప్పితే ఇంకేం లేదు.ల‌క్ష రూపాయిల విమాన టికెట్ లేద‌న్న విష‌యాన్ని విమాన టికెట్లు అమ్మే వెబ్ సైట్ల‌ను చెక్ చేస్తే తెలిసింది. గురువారం కూడా అలాంటి ప‌రిస్థితే ఉంది. నిజానికి గురువారం.. శుక్ర‌వారం టికెట్లు ఓ మోస్త‌రు ధ‌ర‌లు ప‌లికాయే త‌ప్పించి భారీ ధ‌ర‌లు లేవ‌ని చెప్పాలి.

ఎక్క‌డిదాకానో ఎందుకు ఈ రోజు సంగ‌తే చూస్తే.. ఈ రోజుకి ఢిల్లీలో కాలుష్యం త‌గ్గ‌లేదు. అందులోకి వీకెండ్ కూడా. మ‌రి.. ఇలాంటి వేళ విమాన టికెట్టు ధ‌ర భారీగా ఉండాలి. కానీ.. మేక్ మై ట్రిప్ డాట్ కామ్ లాంటి వెబ్‌ సైట్లు చూస్తే.. అందులో టికెట్ ధ‌ర రూ.5వేల‌కు మించి లేదు. ఉన్నా..కొన్ని ప్లైట్లు ఎప్ప‌టిలానే ప‌ది వేలు.. పాతిక వేల ధ‌ర‌లు ప‌ల‌క‌టం మామూలే క‌దా. కానీ.. అలాంటి ధ‌ర‌ల్ని చూపించి జ‌నాల్ని భ‌య‌పెట్టే తీరు చూస్తే.. ఒళ్లు మండ‌క మాన‌దు. వాస్త‌వాన్ని చెప్పాలే కానీ.. ఇలా గాలిని మూట క‌ట్టే వైనం ఏ మాత్రం మంచిది కాదు.