Begin typing your search above and press return to search.

నిజామాబాద్‌ లో ఎయిర్‌ పోర్ట్ కోసం క‌విత ప్ర‌య‌త్నం

By:  Tupaki Desk   |   4 Jan 2018 1:16 PM GMT
నిజామాబాద్‌ లో ఎయిర్‌ పోర్ట్ కోసం క‌విత ప్ర‌య‌త్నం
X
తెలంగాణ‌లో మ‌రో ఎయిర్‌ పోర్ట్ కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌ - నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత రంగంలోకి దిగారు. శంషాబాద్‌ లోని జీఎంఆర్ అంత‌ర్జాతీయ ఎయిర్‌ పోర్ట్ ప్రారంభం సంద‌ర్భంగా జీఎంఆర్ కుదుర్చుకున్న ఒప్పందం కార‌ణంగా...మ‌రో ఎయిర్‌ పోర్ట్ కోసం తెలంగాణ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంది. జీఎంఆర్ విమాన‌శ్రయానికి 150 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మ‌రో విమానాశ్ర‌యం ప్ర‌యాణికులు - స‌రుకు ర‌వాణ కోసం ఉప‌యోగించ‌వ‌ద్ద‌నే ష‌ర‌తు గ‌తంలో కుదిరిన ఒప్పందంలో ఉన్న నేప‌థ్యంలో...ఇంకో విమానాశ్ర‌యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌ పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజును ఎంపీ కవిత కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన కవిత.. మరోసారి వినతిపత్రం సమర్పించారు. విమానాశ్రయ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర కమిటీని పంపించాలని ఆమె కేంద్రమంత్రిని కోరారు. ఎంపీ కవిత వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. జక్రాన్‌ పల్లిలో విమానాశ్రయం ఏర్పాటుకు సానుకూల అంశాలు ఉన్నాయని ఆమె మంత్రికి వివరించారు.

కాగా, ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఎంపీ క‌విత మ‌రో ప్త‌ర్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని స్పైస్ పార్కుకు రూ.20 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు సంసిద్ధత వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ఆమె స్పైస్ పార్క్‌ కు సాయంతోపాటు తెలంగాణకు ప్రత్యేక టర్మరిక్ సెల్‌ ను సాధించారు. ఢిల్లీలో మంత్రి సురేశ్ ప్రభును ఎంపీ కవిత కలిశారు. బాల్కొండ నియోజకవర్గంలో స్పైస్ పార్క్ కోసం రాష్ట్రప్రభుత్వం 42 ఎకరాల భూమిని కేటాయించిందని, రూ.30 కోట్ల నిధులను మంజూరు కూడా చేసిందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీపీఆర్‌ ను స్పైస్ బోర్డు ప్రిపేర్ చేసిందని, పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు తోడు మ్యాచింగ్‌ గ్రాంట్‌ గా రూ.20 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. పసుపు రైతులను ఆదుకొనేందుకు ఎంపీ కవిత చేస్తున్న ప్రయత్నాలను సురేశ్‌ ప్రభు అభినందించారు.

కేంద్రమంత్రి సూచన మేరకు ఫిబ్రవరి 3న స్పైస్ బోర్డు చైర్మన్ - వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారులు హైదరాబాద్‌ కు రానున్నారు. అదేరోజు హైదరాబాద్‌ లో వర్క్‌ షాపును నిర్వహిస్తారు. పసుపు రైతులు - పసుపును ఎగుమతి చేసే వ్యాపారులు - పసుపుపంటతో అనుబంధం ఉండే అన్ని వర్గాలవారు వర్క్‌ షాప్‌ లో పాల్గొంటారు.