Begin typing your search above and press return to search.

కేసీఆర్ కాలర్ ఎగరేసేలా కవిత గెలుపు.. అదెలా?

By:  Tupaki Desk   |   10 Oct 2020 11:00 AM IST
కేసీఆర్ కాలర్ ఎగరేసేలా కవిత గెలుపు.. అదెలా?
X
ఫలితం ముందే తెలిసినా.. ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా? అన్న ఆసక్తితో ఎదురుచూసిన ఉప ఎన్నికగా ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రత్యేకతగా చెప్పాలి. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ మాజీ ఎంపీ..కవిత ఎమ్మెల్సీగా మారిపోతున్నారు. గడిచిన కొద్దికాలంగా ఆమె పేరు ముందు ‘మాజీ’ మాట చిరాగ్గా అనిపిస్తున్న పరిస్థితి ఇకపై తప్పిపోనుంది. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో పక్కాగా వ్యవహరించే కేసీఆర్.. గెలుపు ఎప్పుడో డిసైడ్ అయినప్పటికీ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో పక్కా వ్యూహాన్ని సిద్ధం చేయటమే కాదు.. అదెలా అమలవుతుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసినట్లు చెబుతున్నారు.

ఈ కారణంతోనే తాజాగా జరిగిన పోలింగ్ లో వంద శాతం నమోదైంది. మొత్తం 824 ఓట్లకు.. 823 మంది వచ్చి ఓటేశారు. ఓటు వేయని ఆ ఒక్కరు కూడా మరణించిన కారణంగా ఓటు వేయలేదు. వీరిలో ఇద్దరు తప్పించి మిగిలిన వారంతా కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఓటేశారు. మరో ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన 24 మంది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. వీరందరికి ప్రత్యేకంగా సాయంత్రం 4-5 మధ్యలో ఓటు వేయించారు.

ఈ ఎన్నికల్లో విజయం భారీగా ఉంటుందని చెబుతున్నారు. వార్ వన్ సైడ్ అన్నట్లుగా తుది ఫలితం వెలువడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లే లెక్కల్ని వినిపిస్తున్నారు. చాలాచోట్ల భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని.. తమ సత్తా చాటేందుకు వీలుగా టీఆర్ఎస్ నేతలు తెర వెనుక మంత్రాంగం నడిపినట్లుగా చెబుతున్నారు. ఎంపీగా ఓడిన కవిత.. తాజా ఎన్నికల్లో వచ్చే మెజార్టీతో పాత ఓటమిని మర్చిపోయేలా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. పోలైన 823 ఓట్లలో 700 ఓట్లకు పైనే కవితకు పడినట్లుగా అంచనాలు వినిపిస్తున్నాయి. బరిలో దిగిన కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదంటున్నారు. మొత్తంగా కేసీఆర్ కాలర్ ఎగురవేసేలా కవిత ఎన్నికల విజయం ఉండటం ఖాయమంటున్నారు.