Begin typing your search above and press return to search.

నిజాం ప్ర‌పంచంలోనే తోపు అంటున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   7 Nov 2017 1:34 PM GMT
నిజాం ప్ర‌పంచంలోనే తోపు అంటున్న కేసీఆర్‌
X

హైద‌రాబాద్ నిర్మాత నిజాంపై త‌న‌కున్న మ‌మ‌కారాన్ని చాటుకోవ‌డంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఏనాడు వెన‌క‌డుగు వేయ‌ర‌నే సంగ‌తి తెలిసిందే. సంద‌ర్భం ఏదైనా కేసీఆర్ అవ‌కాశం దొరికితే నిజాంను కీర్తిస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు నిజాం చేసిన కార్యాల‌ను వివ‌రించిన కేసీఆర్ తాజాగా త‌న‌కు, త‌న కుటుంబానికి జ‌రిగిన మేలును అసెంబ్లీ వేదిక‌గా గులాబీ ద‌ళ‌ప‌తి వివ‌రించారు. భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ నిజాంను వేనోళ్ల పొగిడారు. భూ రికార్డుల విష‌యంలో ప్ర‌తిపక్ష ఎమ్మెల్యే భట్టి విక్రమార్క షేర్‌ షా సూరి - మన్రోల ప్ర‌స్తావ‌న తెర‌మీదకు తీసుకురాగా...కేసీఆర్ అందుకు అభ్యంత‌రం తెలిపారు.

భ‌ట్టి చెప్తున్న ప్ర‌ముఖులు తెలంగాణ సంస్కృతికి సంబంధం లేని వారని కొట్టిపారేశారు. `హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించింది - విద్యాసంస్థలు - ఆస్పత్రులు వంటి వన్నీ నిర్మించిన ప్రాతఃస్మరణీయుడు సాలార్‌ జంగ్‌1. పూర్తి చేసింది సాలార్‌ జంగ్ 2. ఈ నిజాంలు ఎంతో చేశారు`` అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ``1932-34లో జాగిర్దార్లు - జమీందార్లు ఉండగా అప్పటి నిజాం సర్వే సెటిల్‌ మెంట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. నిజాంపై కొంద‌రికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే మా అభిప్రాయాలు మాకున్నాయి. ప్రపంచంలో ఎవరూ చేయని మంచి పనులు చేసిన ఘనత నిజాం రాజుది`` అని తేల్చిచెప్పారు. ``ఆదిలాబాద్‌ జిల్లాలో కొమురం భీం అనే ఆదివాసి యోధుడు జల్‌...జంగల్‌..జమీన్‌ అనే నినాదంతో పోరాటం చేస్తే...స్థానికంగా ఎందరో ఉన్నప్పటికీ హైమన్‌ డార్ఫ్‌ అనే విదేశీయుడిని కమిషనర్‌ గా వేసి మరీ రికార్డులను ప్రక్షాళన చేశారు. లక్ష ఎకరాలు ఆ కాలంలో పాత ఆదిలాబాద్‌ జిల్లాలోని వారికి పంచారు.`` అని వివ‌రించారు.

ఒక సంస్థానానికి రాజుగా ఉండి కూడా సర్వ స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘ‌న‌త నిజాంకే ద‌క్కుతుంద‌ని సీఎం కేసీఆర్ వివ‌రించారు. `నిర్ణ‌యాత్మక‌శ‌క్తిగా రాజు ఉండ‌గా...ఇలాంటి వేదిక‌ను ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి నిజాం. సమైక్యపాలకులు ఆనాటి చరిత్రను మలినం చేయడం వల్ల ఇలాంటి విషయాలు వెలుగులోకి రాలేదు. నా వరకు నా కుటుంబం విషయంలో నిజాం చర్యల వల్ల మేలు కలిగిన ఉదంతాలు ఉన్నాయి. 1931-40లో అప్పర్‌ మానేరుడాం భూమి పోతే నిజాం ఇచ్చిన పరిహారం సరిపోనందున మా తండ్రిగారు కోర్టును ఆశ్రయించగా మరో 70 వేల అదనంగా ఇవ్వమని తీర్పు వచ్చింది. దీన్ని గౌరవించిన నిజాం ఆ మేరకు మాకు డబ్బులు చెల్లించారు`` అంటూ ఆనాటి అనుభూతుల‌ను పంచుకున్నారు.