Begin typing your search above and press return to search.

నిజాం వారసుడి అద్భుతం...ఈ 'బంగారు' కొండ

By:  Tupaki Desk   |   17 March 2020 8:00 AM IST
నిజాం వారసుడి అద్భుతం...ఈ బంగారు కొండ
X
నగరం నడిబొడ్డులో కృత్రిమ కొండ
భూత్ బంగ్లా కాదు...బంగారు కొండ...
భూత్ బంగ్లా టు బంగారు కొండ...నిజాం వారసుడి అద్భుతం
ఆ కొండ కోసం వేల కోట్లు వదులుకున్న నిజాం వారసుడు
కోట్లు వద్దనుకొని `కొండ`నిర్మించిన `నిజాం` మాంఝీ
నిజాం వారసుడి అద్భుతం...ఈ `బంగారు` కొండ

నలుగురికి నచ్చినది...నాకసలే ఇక నచ్చదురో....పరులెవరు నడవనిది....ఆ రూట్లో నే నడిచెదరో....నేను ఒక్కడిని ఒక వైపు....లోకం ఒక వైపు....అంటూ విభిన్న నైజం గల వ్యక్తుల గురించి వర్ణించాడో సినీ కవి. ఆ సినీకవి చెప్పినట్లు...ఊరందరిదీ ఓ దారి అయితే...ఉలికి పిట్టదో దారన్నట్లు....సమాజంలోని కొందరు వ్యక్తులు తమ ఆలోచనల విషయంలో నో కాంప్రమైజ్ అంటుంటారు. అభిరుచుల కోసం ఆస్తిపాస్తులను కూడా లెక్కచేయరు. నలుగురు నడిచేదారిలో నడిస్తే వచ్చే వందల కోట్ల రూపాయల కన్నా....మనసుకు నచ్చింది చేస్తో వచ్చే ఆత్మ సంతృప్తి మిన్న అనుకుంటుంటారు. 6వ నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ (గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌) ముని ముని మనవడు రౌనక్‌ యార్‌ ఖాన్‌ అటువంటి కోవలోకే వస్తారు. హైదరాబాద్ నడిబొడ్డులో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అమ్మి సొమ్ము చేసుకోకుండా....ఆ స్థలంలో ఓ కృత్రిమ కొండను సృష్టించారు ఈ ప్రకృతి ప్రేమికుడు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–25లోని ఎంసీఆర్‌ హెచ్‌ ఆర్‌ డీని ఆనుకొని రౌనక్‌ యార్‌ఖాన్‌కు 75 ఎకరాల స్థలం ఉంది. భూత్‌ బంగ్లా స్థలం అని పిలుచుకునే ఈ స్థలంలో రంగస్థలం వంటి పలు సినిమా షూటింగ్‌ లు జరిగాయి. ఈ 75 ఎకరాల స్థలం అమ్మితే రౌనక్ కు దాదాపు 1000కోట్లు వస్తాయి. అందులో కొంత అమ్ముకున్నా...పది తరాల పాటు కాలు మీద కాలేసుకొని బ్రతకొచ్చు. కానీ, ప్రకృతి ప్రేమికుడైన రౌనక్...అలా చేయలేదు. పదేళ్ల క్రితం తన మదిలో మెదిలిన ఆలోచన ఆచరణ రూపం దాల్చేందుకు దాదాపు 5 కోట్లు ఖర్చు చేశారు. 8 ఏళ్ల పాటు కష్టపడి ఏడు ఎకరాల స్థలంలో ఓ ఎత్తైన కృత్రిమ కొండ నిర్మించారు.లారీలతో ప్రొక్లెయిన్లతో మట్టి - రాళ్లను పేర్చుకుంటూ 180 అడుగుల ఎత్తు కొండను సృష్టించారు. తాను దగ్గరుండి సృష్టించుకున్న ఆ బంగారు కొండ మీద కూర్చొని ఇరానీ చాయ్‌ తాగుతూ నేడు సేదతీరుతున్నారు. ఆ చాయ్ ని సిప్ చేస్తూ....హైదరాబాద్‌ మహానగరం మొత్తాన్ని వీక్షించాలన్న తన కోరికను తీర్చుకున్నారు రౌనక్. తన భార్య కోసం కొండను తవ్వి రహదారిని నిర్మించాడు ధనా మాంఝీ...తన అభిరుచి కోసం లేని కొండను క్రియేట్ చేశాడీ `నిజాం` మాంఝీ.

ఈ కొండపై నుంచి చార్మినార్ - గోల్కొండ నుంచి హుస్సేన్‌ సాగర్ - మౌలాలి గుట్టను వీక్షిస్తూ ...వర్షాకాలంలో కశ్మీర్ ను వీక్షిస్తోన్న తన్మయత్వం పొందుతున్నారు రౌనక్. ఈ కొండపైనే ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ కోసం హాలును నిర్మించానని రౌనక్ చెప్పారు. 35 ఏళ్లుగా తమ ప్రాంతంలో ....గత 6 ఏళ్లుగా ఈ కొండపైన హోలీ వేడుకల్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. ప్లాట్లు చేసి అమ్మితే దాదాపు 1000 కోట్లు వస్తాయని - అది తనకు సంతృప్తినివ్వదని అన్నారు. ఆర్థిక సంతృప్తి కన్నా ఆత్మ సంతృప్తి గొప్పదని...ఈ కొందే తనకు సంతృప్తినిస్తుందని అన్నారు. కొండపై ఓ కుర్చీలో కూర్చుని...కప్పు చాయ్ తాగుతూ....వెలుగుజిలుగుల నగరాన్ని చూస్తుంటే మది పరవశించిపోతుందని....కోట్లు ఇచ్చినా ఆ ఆనందం పొందలేమని అంటున్నారు రౌనక్. నిజాం హయాంలో రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఈ స్థలంలోనే ఒక బంకర్‌ - ఎయిర్‌ రైడ్‌ షెల్టర్‌ నిర్మించారని...105 ఏళ్ల చారిత్రక స్థలాన్ని ఎప్పటికీ అమ్మేది లేదని తేల్చి చెప్పారు రౌనక్. రౌనక్ వంటి వారిని చూస్తే... ఆర్థిక సంతృప్తి కన్నా ఆత్మ సంతృప్తి గొప్పదని తప్పక అనిపిస్తుంది.