Begin typing your search above and press return to search.

పీకేకు భ‌య‌ప‌డి నితీశ్.. లాలూ ఇంటికి ఇఫ్తార్‌కు వెళ్లాడా?

By:  Tupaki Desk   |   23 April 2022 1:30 PM GMT
పీకేకు భ‌య‌ప‌డి నితీశ్.. లాలూ ఇంటికి ఇఫ్తార్‌కు వెళ్లాడా?
X
బిహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ స‌తీమ‌ణి, మాజీ సీఎం కూడా అయిన‌ రబ్రీదేవి రంజాన్‌ను పుర‌స్క‌రించుకుని.. ముస్లిం మ‌త పెద్ద‌ల‌కు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి ఇటీవ‌ల కాలంలో పొలిటిక‌ల్ రైవ‌ల్ అయిన‌.. సీఎం నితీశ్ కుమార్ ను కూడా ఆహ్వానించారు. దీంతో ఆయ‌న ఈ విందుకు హాజ‌ర‌య్యారు. నిజానికి రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ఎన్నిక‌ల్లో తీవ్ర‌స్థాయిలో పోరాడుకున్న ఈ రెండు కుటుంబాలు.. ఇప్పుడు క‌లిసి ఇఫ్తార్ విందు చేసుకున్నాయి.

ఈ ప‌రిణామాలు బిహార్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 2017లో లాలూ నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన నితీశ్.. ఐదేళ్ల తర్వాత మరోసారి ఒకప్పటి మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత ఇంట్లో జరిగిన వేడుకకు హాజరుకావటంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇఫ్తార్ విందుకు హాజరైన నితీశ్.. రబ్రీదేవితో పాటు లాలూ కుమారులు తేజస్వీ, తేజ్ ప్రతాప్ యాదవ్‌తో ఫొటోలు దిగారు.

అయితే అవినీతి ఆరోపణల కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన గంటల వ్యవధిలోనే సీఎం నితీశ్.. లాలూ ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందుకు వెళ్లడంపై చర్చ జరుగుతోంది.

అయితే.. దీని వెనుక రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్.. ఉర‌ఫ్ పీకే వ్యూహం ఉంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం పీకే కాంగ్రెస్‌తో చేతులు క‌లుపుతున్న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఇబ్బంది క‌ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని.. నితీష్ భావిస్తున్నార‌ని అంటున్నారు. అందుకే.. కాంగ్రెస్‌కు అనుకూల ప‌క్ష‌మైన‌.. లాలూతో క‌లిసి పోయేందుకు నిర్ణ‌యించుకున్నారా? లేక‌.. బీజేపీకి షాక్ ఇవ్వాల‌ని నితీష్ భావించారా? అనేది చ‌ర్చగా మారింది.

మరోవైపు ఇఫ్తార్ విందుకు హాజరుకావటంపై వస్తున్న ఊహాగానాలను నితీశ్ కుమార్ తోసిపుచ్చారు. ఇఫ్తార్ విందుకు చాలా మంది ఆహ్వానిస్తుంటారని, వెళ్లడానికి రాజకీయాలకు సంబంధం ఏముందని ప్రశ్నించా రు.

ఆర్జేడీ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరై.. భాగస్వామ్య పక్షమైన బీజేపీకి పరోక్ష సందేశం పంపారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు లాలూ పెద్ద కుమారుడు తేజ్ప్రతాప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్తో తాను రహస్యంగా మాట్లాడాడని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ ప‌రిణామాల‌తో బిహార్‌లో ఏదైనా జ‌రగొచ్చ‌ని అంటున్నారు.