Begin typing your search above and press return to search.

ఎల్.జేపీలో తిరుగుబాటు.. చిరాగ్ పై నితీష్ ప్రతీకారం?

By:  Tupaki Desk   |   14 Jun 2021 2:30 PM GMT
ఎల్.జేపీలో తిరుగుబాటు.. చిరాగ్ పై నితీష్ ప్రతీకారం?
X
బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. లోక్ జనశక్తి (ఎల్.జే.పీ) నేత చిరాగ్ పాశ్వన్ పై ఐదుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు. చిరాగ్ పాశ్వాన్ కలిపి మొత్తం ఆరుగురు ఎంపీలున్న ఎల్.జే.పీలో ఐదుగురు ఎంపీలు లోక్ సభాపక్ష నేతగా చిరాగ్ పాశ్వన్ స్థానంలో ఆ పార్టీ ఎంపీ పశుపతి కుమార్ ను ఎన్నుకోవడంతో ఈ తిరుగుబాటు మొదలైంది.

ఎల్.జేపీ పార్టీని రాంవిలాస్ పాశ్వాన్ స్థాపించారు. జాతీయ స్థాయిలో కేంద్రమంత్రిగా.. దళిత నేతగా వెలుగువెలిగారు. బీహార్ రాజకీయాలను శాసించారు. రాంవిలాస్ మరణం తర్వాత ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. కానీ ఇప్పుడు ఆయన సోదరుడు పశుపతి కుమార్ పరాస్ తాజాగా తన అన్న కొడుకు చిరాగ్ పాశ్వన్ ను గద్దెదించి తను నాయకుడిగా మారాడు.

చిరాగ్ పాశ్వాన్ పనితీరు పట్ల ఈ ఐదుగురు ఎంపీలు అసంతృప్తిగా ఉన్నారు. తండ్రికి ఉన్న సామర్థ్యం ఆయన కొడుకుకు లేదని వారు తిరుగుబాటు చేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి పార్టీని ఘోరంగా ఓడించాడని చిరాగ్ పై వారంతా గుర్రుగా ఉన్నారు.నితీష్ పార్టీ జేడీయూకు తక్కువ సీట్లు వచ్చి.. బీజేపీకి ఎక్కువ రావడానికి చిరాగ్ ఒంటరిగా పోటీచేయడమే కారణంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

అయితే జేడీయూకు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో పోటీచేసి సవాల్ చేశారు చిరాగ్.కానీ ఆయనను గద్దెదించలేకపోయారు. ఇప్పుడు జేడీయూ పన్నిన పన్నాగమే ఇది అని చిరాగ్ పాశ్వాన్ సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. తమ పార్టీలో అసమ్మతి వెనుక ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హస్తం ఉందని చిరాగ్ సన్నిహిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నితీష్ ప్రతీకారం తీర్చుకున్నాడని.. పరాస్ కు కేంద్రకేబినెట్ పదవి ఆఫర్ ఇచ్చి ఎల్జేపీని నితీష్ చీల్చాడని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.