Begin typing your search above and press return to search.

మోడీ మాజీ ప్రధానేనట... నితీష్ కామెంట్స్ వెనక...?

By:  Tupaki Desk   |   10 Aug 2022 11:30 PM GMT
మోడీ మాజీ ప్రధానేనట... నితీష్ కామెంట్స్ వెనక...?
X
మరోసారి అంటే ఎనిమిదవసారి బీహార్ వంటి అతి పెద్ద రాష్ట్రానికి సీఎం గా ప్రమాణం చేసిన నితీష్ కుమార్ ఫస్ట్ అటాక్ మోడీ మీదనే చేశారు. ఈ రోజు దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు. 2024 తరువాత కూడా ఆయనే ఉండాలనుకుంటున్నారా. అది జరుగుతుందా అంటూ ప్రశ్నించడం ద్వారా బీజేపీ శిబిరానికి గుండె గుబులు పుట్టించేలా భారీ  డైలాగులే వేశారు. నితీష్ కుమార్ మోడీకి ధీటైన నాయకుడే.

ఆయన కూడా వెనకబడిన వర్గాలకు చెందిన నేతగా జనాలు చూస్తారు. అన్నిటి కంటే ఆయన నీతి నిజాయతీ జనాలను ఆకట్టుకుంటాయి. ఆయన రెండు దశాబ్దాలుగా బీహార్  సీఎం గా కొనసాగుతున్నారు. బలమైన ఈ నాయకుడు నిన్నటి దాకా ఎన్డీయేకు ఆకర్షణ అయితే ఈ రోజున విపక్ష శిబిరంలో ఉన్నారు. దాంతో త్రాసు అటు వైపునకు తూగుతోంది. నితీష్ విపక్ష శిబిరంలోకి దూకడం వెనక ఒక పధకం ఉందని అంటున్నారు.

విపక్ష శిబిరానికి సరైన నాయకత్వం లేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీద పెద్దగా విశ్వాసం తోటి పార్టీలు కనబరచడంలేదు. అలాగే మమతా బెనర్జీ అయినా కేసీయార్ అయినా సొంత రాష్ట్రాలకే పరిమితం. దూకుడు చేస్తున్నా అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో జూనియర్ కిందనే లెక్క.

ఇక సీనియర్ మోస్ట్ లీడర్ ని అని చెప్పుకుంటున్న శరద్ పవార్ కి పవర్ పోయి చాన్నాళ్ళే అయింది. పైగా ఎనభైల ఏజ్ దాటేసిన ఈ వృద్ధ నేత ఇపుడు రేసులో ఉన్నా పెద్దగా ఎవరికీ కనిపించే సీన్ లేదని అంటున్నారు. అందుకే మోడీ ఏజ్ కి ఆయన ఇమేజ్ కి సరిసమానుడైన నితీష్ ఇపుడు విపక్ష శిబిరంలోకి దూకారు అని అంటున్నారు. ఒక విధంగా నితీష్ ఈ వైపునకు రావడం బీజేపీకి డేంజర్ బెల్స్ గానే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

నితీష్ విపక్ష శిబిరంలోని పరిస్థితులను, అలాగే బీజేపీ బలహీనతలను అన్నింటినీ అంచనా వేసుకునే ఈ వైపునకు జరిగారని అంటున్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకత అయితే చాలానే  ఉంది. కానీ ఇవతల వైపున  సరైన నాయకుడు లేడు. నితీష్ లాంటి ఇమేజ్ ఉన్న నేత ఉంటే విపక్ష కూటమికి గ్లామర్ బాగా పెరుగుతుంది. అది అంతిమంగా బీజేపీని దెబ్బతీసినా తీస్తుంది అని అంటున్నారు.

ఇలా చాలా వ్యూహాలతోనే నితీష్ విపక్షం వైపు వచ్చారని అంటున్నారు. ఆయన ఫస్ట్ డైలాగ్ కూడా చూస్తే మోడీ మాజీ ప్రధాని  కాక తప్పదనే అంటున్నారు. తాను మాత్రం 2024 తరువాత ఏలాంటి పదవులూ కోరుకోనని, తనకు సీఎం పదవే వద్దంటే 2020లో బలవంతంగా కట్టబెట్టారని నితీష్ చెబుతున్నా రాజకీయ నాయకుల మాటలు కాదంటే అవును అనిలే అన్నట్లుగా ఉంటాయి. దాంతో నితీష్ ఇపుడు మోడీకి ఎదురు నిలిచి బీహార్ మే సవాల్ అంటున్నారు. రేపు ఢిల్లీ మే సవాల్ అని కూడా అనగలరు. మొత్తానికి నితీష్ జంపింగ్ అన్నది మోడీకి బీజేపీకి పెను కలవరమే అని అంటున్నారు. ప్రధాని రేసులో తాను ఉన్నాను అని చెబుతున్న నితీష్ ని ఎదుర్కోవడమే బీజేపికి పెద్ద సవాల్.