Begin typing your search above and press return to search.

ఈసారి ఆ సీఎంపై ఉల్లి గడ్డలు పడ్డాయి

By:  Tupaki Desk   |   4 Nov 2020 10:45 AM IST
ఈసారి ఆ సీఎంపై ఉల్లి గడ్డలు పడ్డాయి
X
బిహార్ లో ఎన్నికల వాతావరణం హాట్ హాట్ గా మారింది. ఓపక్క పోలింగ్.. మరోవైపు ఎన్నికల ప్రచారంతో రాజకీయ అధినేతలంతా హడావుడిగా ఉంటున్నారు. రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే..కాంగ్రెస్ తో కలిసి లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు.

ఇప్పటివరకు జరిగిన పోలింగ్ లలో తమకు అవకాశాలు ఉన్నట్లుగా అటు ఎన్డీయే.. ఇటు ఆర్జేడీ.. కాంగ్రెస్ కూటమి చెప్పుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ మరోసారి బిహార్ కు వచ్చారు. తేజస్వీపై ఆయన గురి పెట్టారు. తొలిదశ పోలింగ్ లో విజయం ఖాయమని తేలిందని.. రెండో దశలోనూ అలాంటి పరిస్థితి ఉందన్న ఆయన.. డబుల్ యువరాజ్ లను ప్రజలు రిజెక్టు చేశారని చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ పాల్గొంటున్న సభల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కొద్దిరోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితీశ్ పై.. చెప్పులు పడటం.. సెక్యురిటీ సిబ్బంది అలెర్టు కావటం తెలిసిందే. తాజాగా మరోసారి నితీశ్ కు చేదు అనుభవం ఎదురైంది. మధుబని జిల్లా హర్లఖీలో ప్రచార సభ నిర్వహిస్తున్న నితీశ్ పై ఓ వ్యక్తి ఉల్లిగడ్డలు.. రాళ్లు విసిరిన వైనం సంచలనంగా మారింది.

ఉద్యోగ కల్పన గురించి ముఖ్యమంత్రి నితీశ్ మాట్లాడుతున్న వేళ.. ఆయన వైపు కొన్ని ఉల్లిగడ్డలు.. రాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో.. అలెర్టు అయిన భద్రతా సిబ్బంది సీఎం చుట్టూ రక్షణ కవచంగా నిలిచారు. తన ఎన్నికల ప్రచారంలో సీఎం నితీశ్ కు ఇలాంటి అనుభవాలు ఎదురుకావటం గమనార్హం.