Begin typing your search above and press return to search.

బాగ్దాదీని లేపేయటంలో కీలకంగా మారిన 'ఆమె'

By:  Tupaki Desk   |   28 Oct 2019 4:51 AM GMT
బాగ్దాదీని లేపేయటంలో కీలకంగా మారిన ఆమె
X
ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఇస్లామిక్ స్టేట్ కారణంగా ప్రపంచం ఎంతలా వణికిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. భూమి మీద పుట్టినోళ్లకు ఇంత దారుణమైన పరిస్థితులు రావటం ఏమిట్రా అనేలా చేసిన ఐసిస్ దళాల దుర్మార్గాలపై ఎన్ని వీడియోలు బయటకు వచ్చాయో చెప్పనలవి కాదు. అంతేనా.. మహిళల్ని వారు పెట్టినంత టార్చర్ ప్రపంచంలో మరెవరూ పెట్టలేదన్న మాట వినిపిస్తుంది.

మహిళను సెక్స్ బానిసగా చూడటమే కాదు.. ఉగ్రవాదుల చెరబట్టిన లక్షలాది అమాయక మహిళలు ఎంతగా బలైపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాడెన్ తీరుకు భిన్నంగా అత్యంత పాశవికంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని వ్యాపించేలా చేయటంలో ఐసిస్ అధినేత బాగ్దాదీ కీలకంగా వ్యవహరించారు. మరి.. అతగాడ్ని లేపేసిన అమెరికా దళాలకు సాయం చేసి.. అతడి మరణానికి కారణమైనది ఎవరు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బాగ్దాదీ ఆచూకీని తెలపటమే కాదు.. అతగాడి చావులో కీలకభూమిక పోషించింది బాగ్దాదీకి సన్నిహితుడైన ఉగ్రవాది భార్య కావటం విశేషం. 29 ఏళ్ల నిస్రిన్ అసద్ ఇబ్రహీం ఇచ్చిన సమాచారంతోనే బాగ్దాదీని అంతమొందించటానికి అవకాశం లభించిందని చెప్పాలి. ఆమె ఇచ్చిన సమాచారంతోనే బాగ్దాదీ ఎక్కడ ఉన్న విషయాన్ని అమెరికా దళాలు గుర్తించగలిగాయి. నిస్రిన్ భర్త 2015 మేలో తూర్పుసిరియాలోని అల్ -ఒమర్ చమురు క్షేత్రంపై జరిగిన దాడిలో మరణించాడు. ఆ సమయంలోనే నిస్రిన్ ను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

అనంతరం ఆమె అమెరికాదళాలకు సాయం చేసేందుకు అంగీకరించారు. అప్పటినుంచి బాగ్దాదీకి సంబంధించిన గుట్టుమట్లు మొత్తాన్ని ఇవ్వటం షురూ చేశారు. వాస్తవానికి మూడేళ్ల క్రితమే బాగ్దాదీ మరణానికి ముహుర్తం పెట్టేశారు. 2016 ఫిబ్రవరిలో ఇరాక్ లోని మోసుల్ లో బాగ్దాదీ నివాసాన్ని గుర్తించిన నిస్రిన్.. అమెరికా దళాలకు పక్కా సమాచారాన్ని అందించారట. అయితే.. అమెరికా అధ్యక్షుల వారి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవటంతో ఆ ఆపరేషన్ ఆగినట్లు చెబుతారు. కట్ చేస్తే.. తాజాగా బాగ్దాదీని లేపేయటంలోనూ నిస్రిన్ కీలకమన్న మాట వినిపిస్తోంది.