Begin typing your search above and press return to search.

నిర్భయ అత్యాచార నిందితులకు డెత్ వారెంట్!

By:  Tupaki Desk   |   7 Jan 2020 5:05 PM GMT
నిర్భయ అత్యాచార నిందితులకు డెత్ వారెంట్!
X
ఏడేళ్ల కిందట దేశాన్ని కుదిపేసిన నిర్భయపై అత్యాచారం ఘటనలో దోషులకు ఇంతవరకు శిక్షలు అమలు కాకపోవడం ఎంతోమందిని ఆవేదనకు, అసంతృప్తికి గురిచేసింది. నిర్భయ హంతకులను ఉరితీసి ఆమె ఆత్మకు శాంతి కలిగించాలని, న్యాయం చేయాలని ఎందరో డిమాండ్ చేశారు. చివరకు ఆ రోజు దగ్గరపడింది... నిర్బయకు నిజమైన న్యాయం జరిగే రోజొస్తోంది. జనవరి 22 ఉదయం 7 గంటలకు నిర్భయ అత్యాచార దోషులను ఉరితీయాలని దిల్లీలోని పాటియాలా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆ కోర్టు డెత్ వారెంట్ ఇచ్చింది.

ఈ ఆదేశాలు ఇవ్వడానికి ముందు నలుగురు దోషులనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి వారి పేర్లు అడుగుతూ, వారే దోషులని నిర్థరించుకున్నారు. ఆ తర్వాత మీడియాను కోర్టు హాల్ నుంచి బయటకు పంపేశారు. నిర్భయ కేసులో దోషులు నలుగురికీ శిక్షను అమలు చేయాలని, డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ నిర్భయ తల్లి ఆశాదేవి పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించింది. జనవరి 22 లోపు (అంటే 14 రోజుల్లోపు) వారు క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

కాగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు.మొదటి నుంచి ఈ కేసు విషయంలో మీడియా- ప్రజలు - రాజకీయ నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరగలేదని ఆయన అన్నారు. "నా కుమార్తెకు న్యాయం జరిగింది. ఈ నలుగురు దోషులనూ ఉరితీస్తే దేశంలోని మహిళలకు ధైర్యం కలుగుతుంది. ఈ నిర్ణయంతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం మరింత పెరుగుతుంది" అని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. జనవరి 22 ఉదయం 7 గంటలకు దోషులను ఉరితీస్తున్నారు. ఈ నిర్ణయంతో ఇలాంటి నేరాలు చేయాలనుకునేవారిలో భయం పుడుతుంది" అని నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ అన్నారు.

కాగా ప్రస్తుతం నలుగురు దోషులూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఒకవేళ దాన్ని సుప్రీం కోర్టు తిరస్కరిస్తే, అప్పుడు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరవచ్చు. అయితే, రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష దొరక్కపోవచ్చనే అంచనాలు భారీ ఉండడంతో నలుగురు దోషులకు ఉరి తప్పదని భావిస్తున్నారు. జనవరి 22 ఉదయం 7 గంటల తరువాత నిర్భయ దోషులు ఇక జీవించి ఉండరని భావిస్తున్నారు.