Begin typing your search above and press return to search.

నిర్భయ దోషుల మంత్రాంగం..మరోసారి ఉరి రద్దేనా?

By:  Tupaki Desk   |   1 March 2020 1:33 PM GMT
నిర్భయ దోషుల మంత్రాంగం..మరోసారి ఉరి రద్దేనా?
X
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హత్యాచారం ఘటన నిర్భయలో దోషులుగా తేలిన వారికి ఉరి శిక్ష అమలు మరోమారు వాయిదా పడేలానే కనిపిస్తోంది. తమపై వేలాడుతున్న ఉరి తాడును ఎప్పటికప్పుడు వాయిదా వేయించుకుంటూ వస్తున్న నిర్భయ దోషులు.. తాజాగా శనివారం కూడా మరో ఎత్తు వేశారు. తమకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ అక్షయ్ సింగ్, పవన్ కుమార్ గుప్త లు సర్వోన్నత న్యాస్థానం సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు... ఈ నెల 2వ తేదీ (సోమవారం లోగా) తమ అభిప్రాయం తెలపాలంటూ నిర్భయ దోషులు శిక్ష అనుభవిస్తున్న తీహార్ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది.

ఇప్పటికే నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు చేయాలంటూ కోర్టు తీర్పు ఇవ్వగా... దానిని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే తాము చేసిన తప్పునకు ఏమాత్రం పశ్చాత్తాపం లేని నిర్భయ దోషులు.. తమ మెడలపై వేలాడుతున్న ఉరి తాడు నుంచి ఎలాగైనా తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తమ న్యాయవాదులను అడ్డం పెట్టుకుని క్షమాభిక్ష పిటిషన్ల నాటకం ఆడుతున్న నలుగురు నిందితులు ఎప్పటికప్పుడు ఉరిని వాయిదా వేస్తూనే ఉన్నారు. ఒకే కేసులో దోషులుగా తేలిన వారందరికీ ఒకే సారి ఉరిశిక్ష అమలు చేాయలన్న నిబంధనను ఆసరా చేసుకుని నిర్భయ దోషులు నిజంగానే డ్రామాలు ఆడుతున్నారని చెప్పక తప్పదు.

వాస్తవంగా ఇదివరకు నిర్భయ దోషులు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్లు, సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్లన్నీ కొట్టివేతకు గురయ్యాయి. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన (మంగళవారం) నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు తీర్పు చెప్పడం, అందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరోమారు అక్షమ్ సింగ్ - పవన్ కుమార్ గుప్తలు... తమకు విధించిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో రాష్త్రపతికి చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ లో పూర్తి వివరాలను పొందుపరచలేదన్న సాకును చూపిన దోషులు... సదరు పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించేలా ఎత్తుగడ వేశారు. దీంతో మరోమారు నిర్భయ దోషులకు ఉరి శిక్ష వాయిదా పడక తప్పదేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.