Begin typing your search above and press return to search.

క‌దిలిస్తున్న నిర్భ‌య‌ త‌ల్లి బ‌హిరంగ లేఖ

By:  Tupaki Desk   |   21 March 2018 5:15 AM GMT
క‌దిలిస్తున్న నిర్భ‌య‌ త‌ల్లి బ‌హిరంగ లేఖ
X
నిర్భ‌య పేరు గుర్తుకు వ‌చ్చినంత‌నే దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో తెలీని బాధ‌ను వ్య‌క్తం చేస్తారు. చిన్న వ‌యసులో.. చేయ‌ని త‌ప్పున‌కు భారీ మూల్యాన్ని చెల్లించ‌ట‌మే కాదు.. ప‌గోడికి కూడా అలాంటిది వ‌ద్ద‌నుకునే దారుణాన్ని ఎదుర్కొంది. ప‌శువులు సైతం చేయ‌ని పాడు ప‌నిని.. రాక్ష‌స అంశ‌తో ఉన్న కొద్దిమంది మ‌గాళ్ల కార‌ణంగా త‌న జీవితాన్ని అర్ధాంతంగా ముగించుకొని వెళ్లిపోయింది.

నిర్భ‌య ఉదంతం వెలుగు చూసిన‌ప్పుడు యావ‌త్ దేశం ర‌గిలిపోయింది. ఆవేద‌న‌తో విల‌విల‌లాడిపోయారు. ఆ దుర్మార్గానికి పాల్ప‌డిన వారిని న‌డిరోడ్డు మీద ఉరి తీయాల‌న్న డిమాండు కోట్లాది మంది చేసినా.. చ‌ట్టం ముందు ప్ర‌జ‌ల భావోద్వేగం ఏదీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు.

నిర్భ‌య మ‌ర‌ణించిన ఇన్నాళ్ల‌కు.. క‌ర్ణాట‌క మాజీ డీజీపీ ఒక‌రు చేసిన వ్యాఖ్య‌లు షాక్ కు గురి చేయ‌ట‌మే కాదు.. మ‌న‌సున్న ప్ర‌తి ఒక్క‌రిని మండిపోయేలా చేసింది. మ‌హిళా దినోత్స‌వం నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మాజీ డీజీపీ సంగ్లియానాను పిలించిన వారికి.. అక్క‌డ ఆయ‌న చేసిన దుర్మార్గ వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి.

ఇదే కార్య‌క్ర‌మానికి హాజ‌రైన నిర్భ‌య త‌ల్లిని ఉద్దేశించి.. ఆమె ఫిజిక్ పై చేసిన కామెంట్లు.. ఆమె అంత అందంగా ఉంటే.. నిర్భ‌య మ‌రెంత అందంగా ఉంటుందో తాను ఊహించ‌గ‌ల‌న‌ని చేసిన పైత్య‌పు మాట‌లు వికారాన్ని క‌లిగించ‌ట‌మే కాదు.. షాక్ కు గురి చేశాయి. మ‌నుషులు ఇలా కూడా మాట్లాడతారా? అన్న సందేహాన్ని వ‌చ్చేలా చేశాయి. త‌న కుమార్తెకు జ‌రిగిన అన్యాయంపై ఇప్ప‌టికి కోలుకోలేని నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి అయితే.. సంగ్లియానా మాట‌లు మ‌రింత షాకింగ్ కు గుర‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ.. ఆమె త‌న విచ‌క్ష‌ణ‌ను మర‌వ‌లేదు.

సంగ్లియానా లాంటోళ్లు వికార‌పు మాట‌లు మాట్లాడినా ఆమె మాత్రం హుందాగానే మాట్లాడారు. క్లుప్తంగా త‌న ప్ర‌సంగాన్ని ముగించారు. త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర మాత్రం.. ‘‘నా ఫిజిక్‌ కంటే నేను చేసిన న్యాయ పోరాటాన్ని గుర్తు చేసుకుని ఉంటే బాగుండేది" అని ఆవేదన చెందారు.

సంగ్లియానా వ్యాఖ్య‌ల‌పై దేశ వ్యాప్తంగా దుమారం రేగి.. ప్ర‌తి ఒక్క‌రూ తిట్టిపోస్తున్న వేళ‌.. త‌న వ్యాఖ్య‌ల‌పై విచారం వ్య‌క్తం చేశారు. ఇలాంటివేళ నిర్బ‌య త‌ల్లి హుందాగా త‌న ఆవేద‌న‌ను బ‌హిరంగ లేఖ రూపంలో బ‌య‌ట‌పెట్టారు. ఆమె లేఖ‌లోని అంశాల్ని ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ ప్ర‌చురించింది.అందులోని ముఖ్య‌మైన అంశాల్ని చూస్తే..

"మీరు నా శరీరాకృతిని ప్రశంసిస్తూ కామెంట్‌ చేశారు. ఆ కామెంట్‌ చేసే ముందు... అది ఏ మాత్రం సముచితమో ఒకసారి ఆలోచించి ఉండాల్సింది. దాంతోపాటు మా అమ్మాయి అందచందాల గురించి కూడా మాట్లాడారు. అత్యంత క్రూరంగా గాయపడి, చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన అమ్మాయి దేహాకృతిని ఊహించారు"

"లైంగిక దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమ్మాయి సౌందర్యం గురించి మాట్లాడారు! తన మీద దాడికి పాల్పడిన వారిని నిరోధిస్తూ మా అమ్మాయి ఎంతగా ప్రతిఘటించిందనే సంగతిని మీరు గుర్తించలేకపోయారు, ఆ ప్రతిఘటనను గౌరవించలేకపోయారు. మా అమ్మాయిలా మరే ఆడబిడ్డకూ జరగకూడదని నేనెంతగా పోరాటం చేశానో మీరు గుర్తించలేకపోయారు"

"మీ వ్యాఖ్యల ద్వారా మీరు మీలో నిండి ఉన్న అనారోగ్యకరమైన ధోరణిని బయటపెట్టుకున్నారు. మీ ఆలోచనలు కూడా మా అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడిన మగవాళ్ల ఆలోచనల్లాగానే ఉన్నాయి. ఒక ఆడపిల్ల తమ దాడికి లొంగిపోకుండా ప్రతిఘటించడాన్ని పురుషాధిక్య అహంకారం సహించలేకపోయింది.అందువల్లనే ఆమెను అంత క్రూరంగా హింసించినట్లు వాళ్లే చెప్పారు"

"మీ మాటలు కూడా అలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్న వాళ్లను ప్రోత్సహించేవిగానే ఉన్నాయి. మీరు చేసిన హేయమైన వ్యాఖ్యలతో మీరు యువతులకు ఏం చెప్పారు? లైంగిక దాడి జరిగినప్పుడు ప్రతిఘటించి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా, లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి... అని!"

"మీ ఈ అభిప్రాయం ప్రకారం... మీరు మన దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న సైనికులకు ఏం చెబుతారు? శత్రువు దాడి చేసినప్పుడు ఆయుధాలను విసిరేసి లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోమనా? మీరు మాట్లాడింది ఏమాత్రం సమంజసం కాదని ఇప్పటికైనా గ్రహించారా? ఆడపిల్లలకు మీరు బలహీనమైనవాళ్లు, పరిస్థితులను బట్టి రాజీ పడుతూ మిమ్మల్ని మీరు ఫణంగా పెట్టుకుంటూ జీవించాలి... అని సందేశం ఇవ్వదలుచుకున్నారా మీరు?"