Begin typing your search above and press return to search.

ఉరిపై...నిర్భయ తల్లి ఆశాదేవి `ఆశ` ఇదే

By:  Tupaki Desk   |   5 March 2020 4:22 PM GMT
ఉరిపై...నిర్భయ తల్లి ఆశాదేవి `ఆశ` ఇదే
X
2012లో కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిర్భయను నిర్దయగా రేప్ చేసిన దోషులకు ఉరే సరి అని యావత్ దేశం ఆకాంక్షించింది. అందరి ఆకాంక్షలకు అణుగుణంగానే వారికి ఉరి బిగుసుకుంది. తాజాగా మార్చి 20న దోషులందరినీ ఒకే సారి ఉరి తీయాలని డెత్ వారెంట్ జారీ అయింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ ఉరి....ఈ సారి కచ్చితంగా అమలవుతుందని యావత్ దేశం ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఉరి శిక్ష వాయిదాల మీద వాయిదాలు పడడంతో తీవ్ర మనోవేదనకు గురైన నిర్భయ తల్లి ఆశాదేవి ఈ సారైనా ఉరి సరిగ్గా అమలవుతుందని గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, అవకాశముంటే..తన కూతురుని చంపిన కిరాతకుల చావును కళ్లారా చూస్తానంటూ చమర్చిన కళ్లతో ఆవేదనాభరితంగా చెబుతోంది.

నిర్భయ దోషులకు అదే చివరి రోజు కావాలి అని....అనుమతిస్తే ఆ కామాంధుల చావును ప్రత్యక్షంగా చూస్తానని నిర్భయ తల్లి కోరుకుంటున్నారు. 2012 డిసెంబరు 12న తమ జీవితాల్లో చీకటి అలుముకుందని....2020 మార్చి 20 ఉదయం తమ జీవితాలలో వెలుగులు వస్తాయని ఆశిస్తున్నట్లు ఆశాదేవి తెలిపారు. ఈ సారైనా వాయిదాపడకుండా....కచ్చితంగా నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తారనే భావిస్తున్నట్లు తెలిపారు. న్యాయపరమైన లొసుగులను అడ్డుపెట్టుకొని నిందితులు ఇప్పటికే చాలా కాలం బ్రతికిపోయారని....ఇక వారి జీవితాలకు అంతిమ తీర్పు వచ్చిందని అన్నారు. కాగా, మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నిర్భయ దోషులు నలుగురినీ ఒకేసారి ఉరితీయాలంటూ ఢిల్లీ పాటియాలా కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దోషులకు రాష్ట్రపతి క్షమాభిక్ష సహా అన్ని దారులూ మూసుకుపోవడంతో ఉరి ఖాయమని అంతా భావిస్తున్నారు