Begin typing your search above and press return to search.

ఆ తల్లి కంటతడి అక్కడున్నోళ్ల గుండె మండేలా చేసింది

By:  Tupaki Desk   |   12 Feb 2020 11:45 AM GMT
ఆ తల్లి కంటతడి అక్కడున్నోళ్ల గుండె మండేలా చేసింది
X
కదులుతున్న బస్సులో ఏ పాపం తెలీని ఒక నిస్సహాయ ఆడపిల్లను అత్యంత దారుణంగా.. పైశాచికంగా.. మాటల్లో వర్ణించలేనంతగా మానసికంగా.. శారీరకంగా హింసింది.. ఆమె మరణానికి కారణమైన వారికి విధించిన ఉరిశిక్ష అంతకంతకూ వాయిదాలు పడుతున్న వైనంపై దేశ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నేరం రుజువై.. వారు తప్పు చేసినట్లు పలు కోర్టులు తీర్పులు చెప్పేసిన తర్వాత.. శిక్ష అమలు కాకుండా అడ్డుకునేందుకు న్యాయశాస్త్రంలో తమకున్న అవకాశాల్ని వాడుతున్న నిర్భయ దోషుల తీరుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఉరిశిక్ష అమలు కాకుండా ఉండేందుకు ఒకటి తర్వాత ఒకటి చొప్పున వ్యూహాత్మకం తెర మీదకు తీసుకొచ్చి శిక్ష అమలు కాకుండా చేస్తున్నారు. దీంతో.. నిర్భయ దోషుల ఉరి ఆలస్యం కావటమే కాదు.. అసలు అమలు చేస్తారా? లేదా? అన్నది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే.. దోషులకు డెత్ వారెంట్లు ఇష్యూ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు మంగళవారం పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి భావోద్వేగానికి గురయ్యారు. రెండు చేతులు జోడించి.. తాను కూడా మనిషినేనని.. దారుణ ఘటన జరిగి ఏడేళ్లకు పైనే అయ్యిందని.. ఇప్పటికైనా వారికి శిక్షలు విధించండంటూ కోర్టును కోరారు. దోషుల ఉరితీతపై స్టే ఇవ్వొద్దని కేంద్రం చేసిన వినతిని కోర్టు నో చెప్పిన నేపథ్యంలో నిర్బయ తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరితీతను తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ శిక్షను అమలు చేయొద్దని జనవరి 31న కోర్టు స్టే ఇచ్చింది. దోషులకు విడివిడిగా శిక్షలు అమలు చేయకూడదని.. ఒకేసారి అమలు చేయాలన్న మాటను ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. చట్టంలోని అవకాశాల్ని ఉపయోగించుకుంటూ నిర్భయ దోషులు పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తూ.. కోర్టు విధించిన శిక్షలు అమలు కాకుండా చేస్తున్నారు. తాజాగా కోర్టులో నిర్భయ తల్లి చేసిన ఒక వ్యాఖ్యను విన్నప్పుడు మనసు కలుక్కుమనటం ఖాయం. నేనూ మనిషినే.. మా హక్కుల సంగతి ఏమిలి? బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు? అన్న ఆమె ప్రశ్న ప్రస్తుత న్యాయ వ్యవస్థలోని కొన్ని అంశాల్ని నేరుగా ప్రశ్నించినట్లుగా ఉందని చెప్పక తప్పదు.