Begin typing your search above and press return to search.

నేర‌స్తుడిని సన్మానించ‌మ‌న్న నిర్భ‌య తండ్రి

By:  Tupaki Desk   |   20 Dec 2015 2:11 PM IST
నేర‌స్తుడిని సన్మానించ‌మ‌న్న నిర్భ‌య తండ్రి
X
డిల్లీలో బస్సులో వెళుతున్న విద్యార్థినిపై గ్యాంగ్ రేప్‌ నకు పాల్పడిన దారుణ సంఘటన జరిగి మూడేళ్లు దాటింది. నిర్భ‌య‌గా ప్ర‌చారంలో ఉన్న ఈ కేసులో బాల నేరస్తుడిగా శిక్ష అనుభవిస్తున్న అఫ్రోజ్ శిక్షాకాలం ముగియనుండడంతో ఆయ‌న్ను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, అతన్ని విడుదల చేయవద్దంటూ నిర్భయ తల్లిదండ్రులు - మహిళా సంఘాలు - రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. విడుద‌ల‌ను ఆపాల‌ని ఢిల్లీ హైకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ ను కోర్టు తిరస్కరించి అతని విడుదలను తాము అడ్డుకోలేమంటూ, స్టే ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతి సింగ్ (నిర్భయ) తండ్రి బద్రినాథ్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త‌న ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కాడు. ఆ వివ‌రాలు

-మన దేశంలో బాల నేరస్థులకు ఎటువంటి చట్టం లేదన్న విషయాన్ని నేను నమ్ముతాను. చాలా మంది బాల నేరస్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. బాల నేరస్థులపై కఠినతరమైన చట్టాలను ఇంత వరకు మన దేశంలో తీసుకురాలేకపోయాం. నిర్భయ కేసులో దోషి విడుదల కానున్నాడన్న వార్తతో ఢిల్లీ ప్రజలకు నిద్ర పట్టడం లేదు. క్షేమంగా ఉండగలుగుతామా అనే భయంతో వారు వణికిపోతున్నారు. ఈ బాల నేరస్థుడు ప్రస్తుతం @సెలబ్రిటీ@కి ఏమాత్రం తక్కువ కాదు. అతను తప్పేమి చేయలేదు. ప్రభుత్వం అతన్ని సత్కరించాలని నేను భావిస్తున్నాను (వ్యంగ్యంగా, కోపంగా). ఆప్ అధినేత కేజ్రీవాల్‌ ను నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ అధికారంలోకి రాక ముందు, షీలా దీక్షిత్ ప్రభుత్వం హయాంలో మహిళలపై జరిగిన నేరాలను అదుపు చేయలేకపోయారని విమర్శించారు. మరి, మీ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరుగుతున్న నేరాలు మరింత దారుణంగా ఉన్నాయి. ఢిల్లీలో మహిళలకే కాదు పురుషులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. . బీజేపీ, ఆప్.. ఆ రెండు పార్టీలు కూడా అంతే.

-సెల్రబిటీ లేదా రాజకీయ నాయకుడి వంటి వారికైతే వెంటనే న్యాయం జరుగుతోంది. నేను పేదవాడిని కనుక ఈ కేసులో న్యాయం జరగడం ఆలస్యమవుతోంది. కోర్టుల్లో కొన్ని లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసులన్నీ ఎందుకు పరిష్కారం కావడం లేదు? ఎవరికైనా న్యాయం జరిగిందా? నిర్భయ కేసు విషయానికి వస్తే.. రెండు, మూడు జనరేషన్ల తరువాత మాకు న్యాయం జరగవచ్చనుకుంటున్నాను. న్యాయం కోసం ప్రభుత్వంపై పోరాడతాను.

--అవినీతిపరులను, నిందితులను ఏ ప్రభుత్వం శిక్షించలేదు. మహిళల రక్షణ అనే అంశంపై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అందుకే, ఎన్నికల్లో పార్టీలు గెలుస్తున్నాయి. రాజకీయ నేతలు తప్పుడు హామీలు, వాగ్దానాలు ఇవ్వడం తప్ప ఒరగబెడుతున్నదేమీ లేదు హత్యలు చేసిన వారికి, అత్యాచారాలు చేసిన వారికి అన్ని ప్రభుత్వాలు మద్దతుగా నిలిచాయి. వారిని కాపాడుతూనే ఉన్నారు. అందుకే ...మహిళల రక్షణ చట్టాల్లో మార్పులు రావాలి. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు.

నిర్భయ ఘటన తరువాత ప్రాణాలున్న ఒక మృతదేహంలా బతుకుతున్నాం తిండి తినలేం.. నిద్ర పోలేం. మాలాంటి ప‌రిస్థితి మరెవ్వ‌రికీ రాకూడదు.