Begin typing your search above and press return to search.

నిర్భయ దోషులకు ఉరి..కీలక పరిణామాలివీ

By:  Tupaki Desk   |   20 March 2020 10:26 AM IST
నిర్భయ దోషులకు ఉరి..కీలక పరిణామాలివీ
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఎట్టకేలకు దోషులకు ఏడేళ్ల తర్వాత ఉరిశిక్ష అమలైంది. దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తీహార్ జైల్లో 5.30 గంటలకు నలుగురు నిర్భయ దోషులను ఉరితీశారు. ఈ నేపథ్యంలో నిర్భయ నిందితుల ఉరికి ముందు తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది.

ఉరిశిక్ష అమలు కోసం హైకోర్టు, సుప్రీం కోర్టును సంప్రదించిన నిర్భయ దోషుల లాయర్లకు ఈ ఉదయం తెల్లవారుజామున 2.30 గంటలకు చుక్కెదురైంది. ఉరి ఖాయం అని తెలియడంతో నిందితులు రాత్రంతా నిద్రపోలేదు.

ఉదయం 4 గంటలకు అధికారులు సెల్ లోంచి నలుగురిని బయటకు తీసుకొచ్చారు. నిర్భయ దోషులైన నలుగురికి ఉరికి ముందు చివరి కోరిక ఏంటని అధికారులు అడిగారు. కానీ వారు చావు కళ్లముందు కదలాడడంతో చివరి కోరిక ఏమీ కోరలేదని జైలు డైరెక్టర్ తెలిపారు. 4.30 గంటలకు స్నానం చేసి వచ్చారు.

ఇక నిర్భయ దోషులు నలుగురు ఉరి తీసేముందు చివరి సారిగా దేవుడిని కూడా తలుచుకోలేదు.నిర్భయ దోషులకు ఉరికి ముందు చివరి సారిగా పూజలు చేసేందుకు అధికారులు అవకాశం ఇచ్చినా నలుగురు దోషులు నిరాకరించారు. ఎలాంటి పూజలు చేయమని తేల్చిచెప్పారు. అనంతరం వారికి అల్పాహారం అందించారు. అనంతరం వైద్యులు పరీక్షించి కాటన్ వస్త్రంతో ముఖాలను కప్పి ఉరికంబం ఎక్కించారు. మేజిస్ట్రేట్ ముందు 5.30 గంటలకు ఉరి తీశారు.

నలుగురు దోషులను అరగంట పాటు ఉరికంబానికి వేలాడి దీశారు. అనంతరం వైద్యులు వారు మరణించారని ధ్రువీకరించారు. నలుగురి మృతదేహాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8 గంటలకు నలుగురి మృతదేహాలకు పోస్టుమార్గం ప్రారంభమైంది. మధ్యాహ్నం శవాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.