Begin typing your search above and press return to search.

జైల్లో నిర్భయ దోషులు సంపాదన ఎంతంటే?

By:  Tupaki Desk   |   15 Jan 2020 11:46 AM IST
జైల్లో నిర్భయ దోషులు సంపాదన ఎంతంటే?
X
సంచలనంగా మారిన నిర్భయ దోషుల దుర్మార్గానికి యావత్ దేశం కదిలిపోయింది. ఆ నరరూర రాక్షసులకు మరణదండన వేయాలన్న మాట ముక్తకంఠంతో వినిపించింది. అయినప్పటికీ వారికి విధించిన ఉరిశిక్ష ఇప్పటివరకూ అమలు కాలేదు. ఇటీవల పాటియాలా కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నెల 22న వారిని ఉరి తీయనున్నారు. ఇదిలా ఉండగా.. ఇంతకాలం తీహార్ జైల్లో ఉన్న నలుగురు దోషులు.. సంపాదించిన సొమ్మును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు.

జైల్లో ఉన్న సమయంలో చేసిన పనికి వారికి కొంత డబ్బును ఇస్తారు. నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ జైల్లో కూలీ పని చేసేందుకు నిరాకరించాడు. దీంతో.. అతనికి జైలు జీవితంలో ఎలాంటి వేతనం దక్కలేదు. మిగిలిన ముగ్గురిలో ముకేశ్ సింగ్ అందరికంటే ఎక్కువ సంపాదించాడు. అతడు తన జైలుజీవితంలో ఏకంగా రూ.69వేలు సంపాదించాడు. తర్వాతి ఎక్కువగా వినయ్ శర్మ రూ.39వేలు సంపాదించగా.. పవన్ గుప్తా రూ.29వేలు మాత్రమే సంపాదించాడు.

ఇదిలా ఉంటే.. తీహార్ జైల్లో ఉన్న నిర్భయ దోషులు.. తమ తీరును మార్చుకోలేదు. జైలు అధికారులకు సహకరించకుండా ఉండటమే కాదు.. పలుమార్లు గొడవ చేశారు. భోజనం చేయకుండా ఉండటమే కాదు.. వారి ప్రవర్తన సరిగా లేని కారణంగా పలుమార్లు చిన్న చిన్న శిక్షల్ని అనుభవించారు. జైల్లో దుష్ప్రవర్తన కారణంగా వినయ్ శర్మకు జైలు అధికారులు పదకొండుసార్లు శిక్షలు వేయగా.. పవన్ కు ఎనిమిదిసార్లు.. అక్షయ్ కుమార్ కు మూడుసార్లు.. ముకేశ్ సింగ్ కు ఒకసారి చిన్న చిన్న పనిష్మెంట్లు విధించారు. మరికొద్ది రోజుల్లో ఉరిశిక్షను అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వారికి పెట్టే భోజనాన్ని తగ్గించారు. ఉరిశిక్ష అమలు చేయనున్న నలుగురు దోషులను జైల్లో వేర్వేరుగా ఉంచారు. కట్టుదిట్టమైన భద్రతను కల్పించటంతో పాటు.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు.