Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దు నీర‌వ్‌ కు ముందే తెలుస‌ట‌

By:  Tupaki Desk   |   25 Feb 2018 11:33 PM GMT
నోట్ల ర‌ద్దు నీర‌వ్‌ కు ముందే తెలుస‌ట‌
X
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ)లో రూ.11,400 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన సెలబ్రిటీ జువెల్లర్ నీరవ్ మోడీకి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌య‌మైన పెద్ద నోట్ల ర‌ద్దు ముందే తెలుసా? ఈ కీల‌క సంస్క‌ర‌ణ‌పై ఉప్పంద‌డంతో ఆయ‌న ముందుగానే జాగ్ర‌త్త ప‌డ్డారా? అంటే అవుననే అంటున్నారు ఓ ఎంపీ. దేశంలో పాత 1000 - 500 రూపాయల నోట్ల చెలామణిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్ద నోట్లు రద్దు కావడానికి కేవలం కొన్ని గంటల ముందు ఆ బ్యాంకుకు చెందిన ఒక శాఖలో రూ.90 కోట్ల నగదును డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నగదును ఆయన బంగారంగా గానీ లేక మరో రూపంలోకి గానీ మార్చుకుని ఉండవచ్చని - ఇందులో వాస్తవాన్ని వెలికితీసేందుకు సమగ్రమైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌ సీపీ) ఎంపీ మజీద్ మెమన్ అంటున్నారు.

అయితే ప్రధాని ఈ ప్రకటన చేయడానికి కేవలం కొద్ది గంటల ముందే పీఎన్‌ బీ శాఖలో నీరవ్ మోడీ రూ.90 కోట్లు డిపాజిట్ చేశారన్న వార్తను చూస్తుంటే ఆయనకు - కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని - నోట్ల రద్దు నిర్ణయం గురించి నీరవ్ మోడీకి ముందే తెలిసి ఉంటుందని స్పష్టమవుతోందని మజీద్ మెమన్ వ్యాఖ్యానించారు. దీనిపై పాల‌క పక్షం స్పందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇదిలాఉండ‌గా...మోడీ దెబ్బ మ‌రో రూపంలో కూడా పీఎన్‌ బీకి మాత్ర‌మే కాకుండా స్టాక్ మార్కెట్‌ కు కూడా షాక్ ఇచ్చింది. పీఎన్‌ బీ కుంభకోణం నేపథ్యంలో బ్యాంక్ షేర్లు విపరీతంగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అమెరికా స్టాక్ మార్కెట్ల భారీ పతనం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ ను దెబ్బతీసింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ మదుపరులు దాదాపు రూ.10,000 కోట్ల (1.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 1-23 మధ్య రూ.9,899 కోట్ల పెట్టుబడులను విదేశీ పోర్ట్‌ ఫోలియో మదుపరులు (ఎఫ్‌ పీఐ) లాగేసుకున్నారు. అంతకుముందు నెల జనవరిలో రూ.13,780 కోట్లకుపైగా పెట్టుబడులను ఎఫ్‌ పీఐలు స్టాక్ మార్కెట్లలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ నెల 14న రూ.11,400 కోట్ల (1.77 బిలియన్ డాలర్లు) కుంభకోణాన్ని పీఎన్‌ బీ ప్రకటించిన సంగతీ విదితమే. దేశ - విదేశీ మదుపరుల భయాందోళనల మధ్య ఆ తర్వాతి ఐదు రోజుల్లోనే పీఎన్‌ బీ మార్కెట్ విలువ ఏకంగా రూ.10,939 కోట్లు హరించుకుపోయింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న ఇతర బ్యాంకుల షేర్లూ భారీ నష్టాలకు లోనయ్యాయి. మరోవైపు రుణ మార్కెట్లలోకి ఈ నెలలో రూ.1,500 కోట్లకుపైగా పెట్టుబడులను ఎఫ్‌ పీఐలు తెచ్చారు.