Begin typing your search above and press return to search.

నీరవ్ మోడీ రాడట.. కారణమేంటంటే?

By:  Tupaki Desk   |   2 Dec 2018 11:39 AM GMT
నీరవ్ మోడీ రాడట.. కారణమేంటంటే?
X
ఇండియాలో బ్యాంకుల దగ్గర వేల కోట్ల అప్పులు చేయడం.. ఆ తర్వాత చడీచప్పుడు లేకుండా విదేశాలకు పారిపోవడం.. బ్యాంకులకు ఎగనామం పెట్టడం.. ఇదీ ఈ మధ్య బిగ్ షాట్స్ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన. విజయ్ మాల్యాతో ఏకంగా 9 వేల కోట్లు అప్పులు చేసి లండన్ పారిపోయి కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే. అతడికి ఇండియాకు రప్పించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఇంతలోనే నీరవ్ మోడీ అనే మరో దగాకోరు తయారయ్యాడు. మాల్యాకు తీసిపోని విధంగా బ్యాంకుల్లో వేల కోట్ల అప్పులు చేసి విదేశాలకు పారిపోయాడీ వజ్రాల వ్యాపారి. అతడిని ఇండియాకు రప్పించడానికి భారత ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది.

తాజాగా అతను ఇండియాకు రాకపోవడానికి చిత్రమైన కారణం చెప్పాడు. భారత్‌ కు వస్తే ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని.. అందుకే అతను స్వదేశానికి రాలేకపోతున్నాడని.. అతని తరఫు న్యాయవాది శనివారం ముంంబయిలోని ప్రత్యేక కోర్టుకు విన్నవించాడు. విచారణలో భాగంగా నీరవ్‌ తరఫున లాయర్‌ విజయ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపించాడు. అతను దేశానికి వస్తే ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు మూకుమ్మడి దాడులు జరిపే అవకాశం ఉందని కోర్టుకు తెలిపాడు. వీరి వాదనను ఈడీ తోసిపుచ్చింది. ఒకవేళ నీరవ్‌కు నిజంగా ప్రాణహాని కలిగే ప్రమాదమే ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ.. ఇలా దర్యాప్తుకు సహకరించపోవడం తగదని పేర్కొంది. మరి వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిపోయిన వాళ్లపై జనాల్లో ఆగ్రహం ఉండటం సహజం. కానీ దాన్ని గ్లోరిఫై చేస్తూ ప్రాణహాని ఉందని ఇండియాకు రానంటే అదేం దిక్కుమాలిన సాకు?