Begin typing your search above and press return to search.

రేషన్ పంపిణీ వాహనాలను పరిశీలించిన నిమ్మగడ్డ .. నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

By:  Tupaki Desk   |   3 Feb 2021 3:20 PM IST
రేషన్ పంపిణీ వాహనాలను పరిశీలించిన నిమ్మగడ్డ .. నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
X
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలతో అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వారికి స్పష్టమైన ఆదేశాలిస్తున్న నిమ్మగడ్డ. తాజాగా ఫిర్యాదుల కోసం యాప్ ను ఆవిష్కరించారు. ఎన్నికల నిర్వహణ కోసం E-Watch యాప్ ను ఆవిష్కరించిన నిమ్మగడ్డ.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదిలా ఉంటే ...ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రేషన్ బియ్యం డోర్ డెలివరీ వాహనాలు ప్రస్తుతం రాజకీయాలకు కేంద్రబిందువుగా మారినట్టు కనిపిస్తోంది.

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉన్నందు వల్ల, గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాహనాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాతే అవి రోడ్డెక్కనున్నాయి. ఈ పరిణామాల మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, ఈ బియ్యం బండ్లను పరిశీలించారు. కొన్ని వాహనాలను ఆయన తన కార్యాలయానికి రప్పించుకొని, తనిఖీ చేశారు. పని తీరు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓ వాహనాన్ని కొంచెం దూరం నడిపించారు. డ్రైవర్‌ కేబిన్ ‌లో కూర్చుని రేషన్‌ పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నిమ్మగడ్డ హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు అయన ఆ వాహనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈ వాహనాలకు పూసిన రంగులు, అతికించిన స్టిక్కర్లు, ఫొటోల గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి , పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ ని అడగ్గా ... ఆయా వాటి గురించి నిమ్మగడ్డకు వివరించారు. పేదలకు రేషన్ బియ్యాన్ని ఎలా పంపిణీ చేస్తారనేది ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాహనంలో అమర్చిన పరికరాలు, జీపీఎస్ వ్యవస్థ, కాటా, అందులో ఎంతమంది సిబ్బంది ఉంటారు, వారెవరు అనే వివరాలను నిమ్మగడ్డకు వివరించారు. పేదలక ఇంటింటికీ బియ్యాన్ని పంపిణీ చేయాలనేది కొత్త పథకం కాదని కోన శశిధర్ మరోసారి ఆయనకు తెలిపారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించలేదని చెప్పారు. బియ్యం బండ్లపై రాజకీయ నేతల ఫొటోలు, పార్టీ గుర్తులు ఉండకూడదంటూ ఇదివరకు హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వాహనాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో, ప్రభుత్వ లోగో ఉంది. చూడాలి మరి నిమ్మగడ్డ ఈ వాహనాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో...