Begin typing your search above and press return to search.

ఇద్దరు ఐఏఎస్ ల పై వేటు... నిమ్మగడ్డ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   22 Jan 2021 7:15 PM IST
ఇద్దరు ఐఏఎస్ ల పై వేటు... నిమ్మగడ్డ సంచలన నిర్ణయం
X
ఏపీ పంచాయతీ ఎన్నికల పంచాయితీ రోజుకో మలుపు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోన్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఇప్పటికే, ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతుండగా, ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నిర్వహణకు ససేమిరా అంటున్నారు. కానీ, హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎస్ఈసీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇద్దరు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు, ఏపీలో 9 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఎస్‍ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు.

ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ , పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీల. మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. అంతకుముందు, రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ లతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ అయ్యేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నించగా వారు హాజరు కాలేదు. దీంతో, ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు హాజరుకావాలని వారిద్దరికీ రాష్ట్ర ఎన్నికల సంఘం మెమో జారీ చేసింది.

కానీ, 5 గంటల తర్వాత కూడా వారు హాజరు కాలేదు. దీంతో, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై నిమ్మగడ్డ రమేష్ సమాలోచనలు జరుపుతున్నారు. అయితే, ఆ ఇద్దరు అధికారులు ఈ రోజు ఉదయమే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. మరోవైపు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని గవర్నర్‌ను నిమ్మగడ్డ కోరినట్లు తెలుస్తోంది. కాగా, హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో తప్పులుండడంతో వాటిని సరిచేయాల్సి వచ్చింది. సవరణలు చేసి సోమవారం పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. కానీ, నోటిఫికేషన్ మాత్రం ఆదివారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుప్రీంలో మరోసారి ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై సందిగ్ధత ఏర్పడింది.