Begin typing your search above and press return to search.

క్లైమ్యాక్స్ కు చేరిన ఎలక్షన్ కమీషన్-ప్రభుత్వం వివాదం

By:  Tupaki Desk   |   28 Oct 2020 5:00 PM IST
క్లైమ్యాక్స్ కు చేరిన ఎలక్షన్ కమీషన్-ప్రభుత్వం వివాదం
X
కొంత కాలంగా ప్రభుత్వం- స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు మధ్య జరుగుతున్న వివాదం క్లైమ్యాక్సకు చేరుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం చివరకు కమీషన్ను జనాలముందు పలుచన చేసేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఏపి స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేస్తు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించినపుడు ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించాల్సిందే అని పట్టుబట్టింది. అయితే వివిధ కారణాల వల్ల హైకోర్టు తర్వాత సుప్రింకోర్టు ఎన్నికల వాయిదానే సమర్ధించాయి. ఎన్నికల వాయిదా నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయమే అయినా కొన్ని షరతులుపెట్టి సుప్రింకోర్టు ఎన్నికల వాయిదాను అంగీకరించింది.

తాజాగా ఎన్నికలను వాయిదా జరపాలని నిమ్మగడ్డ నిర్ణయించిన నేపధ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. అసలీ వివాదం మొత్తం నిమ్మగడ్డ వైఖరి వల్లే మొదలైంది. జరుగుతున్న ఎన్నికలను వాయిదా వేయాలన్న ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వంతో చర్చించాలన్న కనీస మర్యాదను కూడా నిమ్మగడ్డ పాటించలేదు. దాంతో గొడవ మొదలై చివరకు నిమ్మగడ్డను ప్రభుత్వం తీసేయటం, ఆయన కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని కంటిన్యు అవటం అందరికీ తెలిసిందే. నిమ్మగడ్డ వైపు నుండి తప్పు మొదలైతే కమీషనర్ ను తొలగించటం జగన్ చేసిన తప్పు.

ఎన్నికల వాయిదాను ఆమోదించిన సుప్రింకోర్టు ఓ షరుతు పెట్టింది. మళ్ళీ ఎన్నికల నిర్వహణ విషయంలో ముందు ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మాత్రమే నిమ్మగడ్డ నిర్ణయం తీసుకోవాలని గట్టిగా ఆదేశాలిచ్చింది. అయితే నిమ్మగడ్డ మాత్రం రివర్సులో వ్యవహరిస్తున్నారు. ముందు ప్రభుత్వంతో మాట్లాడకుండా రాజకీయపార్టీలతో సమావేశం పెడుతున్నారు. పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతేమన్నా ప్రభుత్వంతో చర్చిస్తారో ఏమో తెలీదు.

ఉద్దేశ్యపూర్వకంగానే నిమ్మగడ్డ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటున్నారని ఆరోపిస్తు వైసీపీ బుధవారం జరుగుతున్న సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మరి అధికారపార్టీ సమావేశాన్ని బహిష్కరించటం ఎలక్షన్ కమీషన్ కు ఎంతమాత్రం మర్యాదకాదు. ఇక్కడ సమస్య జగన్మోహన్ రెడ్డా లేకపోతే నిమ్మగడ్డా అనికాదు. వ్యక్తులు శాశ్వతం కాదని వ్యవస్ధలే ముఖ్యమన్న విషయం రెండు వైపులా లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. కేవలం రాజ్యాంగబద్దమైన సీట్లో కూర్చురన్న ఏకైక అడ్వాంటేజితో నిమ్మగడ్డ ప్రభుత్వంతో చీటికిమాటికీ గొడవలు పెట్టుకోవటం హుందాగా లేదు. సీఎం హోదాలో కూర్చుని నిమ్మగడ్డపై కులదూషణ చేయడం ముఖ్యమంత్రి జగన్ కి స్థాయికి తగ్గట్టు లేదు.

బుధవారం మీటింగులో ఎన్నికలు పెట్టాలని డిసైడ్ అయితే ప్రభుత్వం ఈ విషయంలో కోర్టుకెళుతుంది. ఇదే సమయంలో వాయిదాకు ముందు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలను రద్దు చేయాలని డిసైడ్ అయితే దానిమీద కూడా కోర్టుకెక్కుతుంది. అప్పుడు మళ్ళీ పోయేది ఎలక్షన్ కమీషన్ పరువే అన్న విషయం గ్రహిస్తే ఇటువంటి గొడవలుండవు.