Begin typing your search above and press return to search.

బహమాస్‌ లీక్స్‌.. నిమ్మగడ్డ కంపెనీస్?

By:  Tupaki Desk   |   23 Sept 2016 10:39 AM IST
బహమాస్‌ లీక్స్‌.. నిమ్మగడ్డ కంపెనీస్?
X
ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే) వెల్లడించిన తాజా విషయాలు సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ ఐసీఐజే పత్రాలు దిగ్భ్రాంతికరమైన విషయాలను బయపెట్టాయి. జర్మనీ వార్తాపత్రిక సడుట్చే జైటుంగ్‌ - భారత్‌ లోని న్యూ ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ సహా పలు మీడియా భాగస్వాములతో కలిసి బహమాస్‌ దేశంలో నమోదైన కంపెనీలు - బ్లాక్ మనీ వ్యవహారాలు... వాటిలో తెలుగువాళ్ల పేర్లపై తాజాగా చర్చ నడుస్తుంది. వీరిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌.

మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ గా పేరు పొందిన నిమ్మగడ్డ ప్రసాద్‌ రియల్‌ ఎస్టేట్‌ తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అయితే ప్రస్తుతం విడుదలయిన బహమాస్ లిస్ట్ లో నిమ్మగడ్డ ప్రసాద్‌ - ఆయన సోదరుడు ప్రకాశ్‌ నిమ్మగడ్డలకు బహమాస్‌ లో సుమారు పది విదేశీ కంపెనీలున్నట్లు తేలింది. క్రిస్టల్‌ లేక్‌ ప్రాపర్టీస్‌ ఎల్‌ ఎల్‌ సి - బెస్ట్‌ స్కైలైన్‌ ఇంక్‌ - రౌగ్‌ మోంట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ కంపెనీలకు నిమ్మగడ్డ ప్రసాద్‌ డైరెక్టర్‌ గా వ్యవహరించగా... సిల్వర్‌ క్లిఫ్‌ ప్రాపర్టీస్‌ ఇంక్‌ - బెస్ట్‌ స్కైలైన్‌ ఇంక్‌ - క్రిస్టల్‌ లేక్‌ ప్రాపర్టీస్‌ ఎల్‌.ఎల్‌.సి - బెస్ట్‌ హారిజాన్‌ ఇంక్‌ - కన్వెన్షియానా ఎస్టేట్‌ ఇంక్‌ - టాప్‌ స్కైలైన్‌ ఇంక్‌ - సూపర్‌ స్కేప్‌ ఇంక్‌ - రౌగ్‌ మోంట్‌ హోల్డింగ్స్‌ సంస్థలకు ప్రకాశ్‌ నిమ్మగడ్డ డైరెక్టర్‌ గా వ్యవహరించినట్లు బహమాస్‌ రిజిస్ట్రీ రికార్డులు వెల్లడిస్తున్నాయి.

ఈ తాజా లిస్ట్ లో నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ - ఫ్యాషన్‌ టీవీ ఇండియా ప్రమోటర్‌ రాజన్‌ మధు - బారన్‌ గ్రూప్‌ అధినేత కబీర్‌ మూల్‌ చందానీ - ప్రీమియం ఫిన్నిష్‌ వాటర్‌ బ్రాండ్‌ చైర్మన్‌ అమన్‌ గుప్తా - గుర్జీత థిల్లాన్‌ - మైరా డిలోరస్‌ రెగో - హర్‌ భజన్‌ కౌర్‌ - అశోక్‌ చావ్లా సహా మరికొంతమంది ప్రముఖ వ్యక్తులు ఉన్నట్లు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ తన కథనంలో వెల్లడించింది.

కాగా... నల్ల కుబేరులు తమ ఆదాయ వివరాలు వెల్లడించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం (ఐడిఎస్‌) తుది గడవు ఈ నెల 30తో ముగుస్తున్న తరుణంలో బహమాస్‌ లీక్స్‌ వెలువడటం గమనార్హం.