Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం ... అమ్మఒడి అమలే ఎఫెక్ట్ , జేడీపై వేటు

By:  Tupaki Desk   |   11 Jan 2021 4:26 PM IST
నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం ... అమ్మఒడి అమలే ఎఫెక్ట్ , జేడీపై వేటు
X
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్‌ పై ఎస్ ఈ సీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జీవీ సాయి ప్రసాద్ 30 రోజుల పాటు సెలవులపై వెళ్లి, ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఆయనపై అభియోగాలునమోదు అయ్యాయి. దీన్నిక్రమశిక్షణారాహిత్యంగా ఎన్నికల కమిషన్ పరిగణించి, ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయని ఎస్ ఈ సీ తెలిపింది. జీవీ సాయిప్రసాద్ ‌ను ‌విధుల నుంచి తొలగించింది. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలులేదని చెప్పింది. ఆర్టికల్ ‌243 రెడ్ ‌విత్‌, ఆర్టికల్‌ 324 ప్రకారం విధుల నుంచి సాయిప్రసాద్‌ ని తొలగిస్తున్నట్లు ఎస్ ‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ,మెడికల్‌ లీవ్ ‌లో వెళ్లిన అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు చేయడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍ అనారోగ్య సమస్యలతో నెలరోజులపాటు మెడికల్ లీవు పెట్టారు. సాయి ప్రసాద్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల‌ కమిషనర్‌కు పీఎస్‌గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ రామారావు, మరో అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి కూడా లీవ్‌ పెట్టారు. అయితే ముగ్గురు లీవ్‌ పెట్టినప్పటికి జేడీ సాయి ప్రసాద్‌పైనే నిమ్మగడ్డ చర్యలు తీసుకున్నారు. ఛార్జి మెమో కూడా ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ఇవ్వకూడదన్న ఎస్ ఈ సీ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ రోజు రాష్ట్రంలో రెండో విడత అమ్మఒడి పథకాన్ని వైఎస్ జగన్ ప్రారంభించిన కొద్ది సేపటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్, తన కార్యాలయ ఉన్నతాధికారిపై క్రమశిక్షణాచర్యలకు దిగడం చర్చనీయాంశమౌతోంది. రెండో విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా భావిస్తోంది. వచ్చేనెలలో నాలుగు విడతల్లో నిర్వహించదలిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, అయినప్పటికీ.. దానికి విరుద్ధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడాన్ని తప్పు పడుతోంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ కు అనుగుణంగా సాయి ప్రసాద్ విధులను నిర్వర్తించట్లేదని, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూపుతున్నట్లు భావిస్తున్నారు.