Begin typing your search above and press return to search.

తాత - మనవళ్లకు తేలిక కాదు! బలమైన ప్రత్యర్థులున్నారు!

By:  Tupaki Desk   |   17 April 2019 7:44 AM GMT
తాత - మనవళ్లకు తేలిక కాదు! బలమైన ప్రత్యర్థులున్నారు!
X
ఈ ఎన్నికల్లో తన ఇద్దరు మనవళ్లతో కలిసి పోటీకి దిగారు కర్ణాటక కురువృద్ధ రాజకీయ నేత దేవేగౌడ. ఈ మాజీ ప్రధాని ఈ సారి తన మనవడికి తన సిట్టింగ్ సీటును త్యాగం చేసి తను తుమకూరుకు తరలి వెళ్లారు. దేవేగౌడ సంతానంలో ఇద్దరు కొడుకులు రాజకీయంగా కీలక పదవుల్లో ఉన్నారు.

దేవేగౌడ ఒక తనయుడు కుమారస్వామి కర్ణాటక సీఎంగా ఉండగా, మరో తనయుడు రేవణ్ణ మంత్రిగా ఉన్నారు. ఇక కుమారస్వామి తనయుడు నిఖిల్ మండ్య నుంచి ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. రేవణ్ణ తనయుడు ప్రజ్వల్ మరో సీటు నుంచి ఎంపీగా బరిలోకి దిగారు.

ఇలా ఒకే కుటుంబం నుంచి ఈ సారి ముగ్గురు ఎంపీ క్యాండిట్లు పోటీలో ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ ల పొత్తులో జేడీఎస్ కు దక్కిందే తక్కువ సీట్లు అనుకుంటే వాటిలో మూడు సీట్లలో ఇలా తాతామనవళ్లే పోటీ చేస్తూ ఉన్నారు.

ఇక పోటీ చేయడానికి అయితే వీరికి ఎదురులేదు. టికెట్లను ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా పంచుకున్నారు కానీ, విజయం మాత్రం అంత తేలిక కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

మండ్యలో నిఖిల్ పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. అక్కడ సుమలత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి సత్తా చూపిస్తూ ఉన్నారు. సానుభూతి, సమీకరణాలు ఆమెకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి.

నిఖిల్ కు అక్కడ విజయం ప్రతిష్టాత్మకం. దీంతో తనయుడిని గెలిపించుకోవడానికి కుమారస్వామి గట్టిగా కష్టపడుతూ ఉన్నారు.

మరోవైపు దేవేగౌడకు కూడా అంత తేలికగా ఏమీ లేదు. తమకు కొద్దో గొప్పో పట్టున్న తుమకూరు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు కానీ, అక్కడ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ వ్యక్తి. అతడు తిరుగుబాటు చేశాడు. పొత్తులో భాగంగా ఆ సీటును జేడీఎస్ కు కేటాయించడంపై ఆ కాంగ్రెస్ నేత తిరుగుబాటు చేశాడు. దేవేగౌడ విజయానికి సహకరించడం లేదు.

అందులోనూ తుమకూరు ప్రాంతంలో కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ యుద్ధం ముందు నుంచినే ఉంది.మొన్నటి వరకూ ఇక్కడ ఇరు పార్టీలూ ప్రత్యర్థులుగా పోట్లాడుకున్నాయి. అలాంటి పరిణామాల మధ్యన ఇప్పుడు దేవేగౌడ విజయం అంత సులువు ఏమీ కాదని.. ఈ ఎన్నికల్లో ఆయన ఓడినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు కథ ఏమిటనేది ఇప్పుడప్పుడే తెలియదు!