Begin typing your search above and press return to search.

ఈ బ్రిటన్ ‘కేసీఆర్’ గురించి తెలుసా..?

By:  Tupaki Desk   |   25 Jun 2016 4:41 AM GMT
ఈ బ్రిటన్ ‘కేసీఆర్’ గురించి తెలుసా..?
X
ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దోపిడీని చెప్పి.. విడిపోవటం ద్వారా లాభ పడొచ్చన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా నూరిపోయటమే కాదు.. ప్రజావిప్లవాన్ని తీసుకొచ్చి.. కేంద్రం మెడలు వంచి తాను కోరుకున్న తెలంగాణరాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా వ్యవహరించిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇదే తరహాలో.. యూరోపియన్ యూనియన్ లో భాగస్వామి కావటం ద్వారా బ్రిటన్ ప్రయోజనాలు భారీగా దెబ్బ తింటున్నాయని.. యూనియన్ బయటకు వచ్చేస్తే భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందన్న వాదనను వినిపించటమే కాదు.. తాజాగా బ్రిటీషర్లు తమ ఓటు ద్వారా చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్న వైనం తెలిసిందే.

బ్రిటన్ పౌరుల్లో ఇంత మార్పు రావటం వెనుక మన కేసీఆర్ మాదిరి నేత ఒకరున్నారు. దాదాపు 20 ఏళ్లకు పైగా తాను నమ్ముకున్న సిద్ధాంతం గురించి అందరికి ప్రచారం చేస్తూ.. ఎట్టకేలకు ఆయన తన వాదనకు మెజార్టీ ఆమోదం లభించేలా చేయటమే కాదు.. సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే పరిస్థితి తీసుకొచ్చారు. సమాఖ్య నుంచి బయటకు వస్తే.. బ్రిటన్ అల్లకల్లోలం అవుతుందని.. ప్రపంచ ఆర్థిక చిత్రపటానికి ముప్పు వాటిల్లుతుందన్నభయాలు వట్టివేనని.. వాటిని పట్టించుకోవద్దంటూ బ్రిటన్ పౌరులకు సర్ది చెప్పటంలో ఘన విజయం సాధించిన వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటన్ పౌరుల చారిత్రక నిర్ణయంతో పాటు.. ప్రపంచం మొత్తం షాక్ తినేలా చేయటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి నైజిల్ పాల్ ఫరేజ్. 52 ఏళ్ల ఈ పెద్దమనిషి తన 20 ఏళ్ల స్వప్నాన్ని తాజా ఫలితంలో నెరవేర్చుకున్నట్లుగా చెప్పొచ్చు.

యూకే ఇండిపెండెన్స్ పార్టీ నాయకుడైన ఈ ఫరేజ్.. యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ ఉండటం వల్ల చోటు చేసుకునే నష్టాల గురించి తరచూ చెప్పేవారు. అంతేకాదు 2010 ఎన్నికల్లో పొత్తు సందర్భంగా సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు వచ్చేందుకు మద్దతు పలుకుతామని అధికార కన్సర్వేటివ్ పార్టీతో పొత్తు పెట్టుకునే సందర్భంగా హామీ ఇవ్వాలని షరతు పెట్టటంలో ఫరేజ్ కీలకమని చెప్పాలి.

విద్యార్థిగా కన్సర్వేటివ్ పార్టీలో చురుగ్గా వ్యవహరించిన ఆయన 1992లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.1993లో యూకే ఇండిపెండెన్స్ పార్టీ (యూకేఐపీ) సహ వ్యవస్థాపకుడగా వ్యవహరించిన ఆయన 1999లో ఆగ్రేయ ఇంగ్లాండ్నుంచి ఎంఈపీగా ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో 2004.. 2009.. 2014లలో వరుస విజయాలు సాధించిన ఆయన.. 2010 నవంబరు నుంచి యూకేఐపీ పరాటీ నాయకుడిగా ఎన్నికయ్యారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావటం అంత తేలిక కాదన్న వాదనను తప్పని తేల్చి.. తాను అనుకున్నది సాధించటంలో విజయం సాధించారని చెప్పొచ్చు. తాను నమ్మిన సిద్దాంతాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించటమే కాదు.. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించని ఈయన్ను బ్రిటన్ కేసీఆర్ గా అభివర్ణించొచ్చు.