Begin typing your search above and press return to search.

పుల్వామా దాడి : 13,500 పేజీల ఛార్జ్‌ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

By:  Tupaki Desk   |   25 Aug 2020 2:30 PM GMT
పుల్వామా దాడి : 13,500 పేజీల ఛార్జ్‌ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
X
ఏడాదిన్నర క్రితం 40 మంది జవాన్లను బలి తీసుకున్న పుల్వామా దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐ ఏ) నేడు 13,500 పేజీల ఛార్జ్ ‌షీట్ ను జమ్మూ కోర్టులో దాఖలు చేసింది. ఈ ఘటనకు కారకులైన 20 ఉగ్రవాదుల జాబితాలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌, రవూఫ్ అజ్గర్ వంటి వారిని ఆ దాడికి ప్రధాన సూత్రదారులుగా పొందుపరిచింది. కేసుకు సంబంధించిన టెక్నికల్, మెటీరియల్, సందర్భోచిత ఆధారాలను ఛార్జ్ సీట్ లో పొందుపరిచినట్లు ఎన్ ఐ ఏ అధికారులు తెలిపారు.

గతేడాది ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ హైవేపై సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన దాడిలో మొత్తం 40 మంది జవాన్లను అమరులైయ్యారు. దీనిపై ఏడాదిన్నరగా దర్యాప్తు చేస్తోన్న ఎన్ ఐ ఏ ఎట్టకేలకు చార్జిషీటు వేసింది. అందులో పలు సంచలన విషయాలు ప్రస్తావించింది. పుల్వామా ఉగ్రదాడికి పాకిస్తాన్ గడ్డపై నుంచే ప్లానింగ్, ఆదేశాలు వెలువడ్డాయని ఎన్ ఐ ఏ తెలిపింది. ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులుండగా, అందులో ఏడుగురు పాకిస్తాన్ జాతీయులే కావడం గమనార్హం. జైష్ ఏ మొహ్మద్ చీఫ్ మసూద్ అజార్, అతని సోదరుడు రవూఫ్ అస్గర్ పేర్లను ప్రధాన కుట్రదారులుగా చేర్చింది. 18 నెలల సుదీర్ఘ దర్యాప్తు తరువాత ఎన్ ఐ ఏ 13,500 ల పేజీలతో కూడిన ఛార్జ్ ‌షీట్ వేసింది.

పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సూసైడ్ బాంబర్ ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ కారులో పేలుడు పదార్థలను నింపుకొని, సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డాడు. కాశ్మీర్ విముక్తి పేరుతో జైషే సాగిస్తోన్న ఉగ్రవాదానికి ఆకర్షితులై ఆదిల్ తోపాటు జమ్మూకాశ్మీర్ కు చెందిన పలువురు ఈ దాడులో పాలుపంచుకున్నారు. ఇకపోతే , సూసైడ్ బాంబర్ ఆదిల్ సహా ఈ కేసులో పలువురు నిందితులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఇక పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశం పాత్రను ఖండించిన సంగతి తెలిసిందే. భారతదేశం సాక్ష్యాలు ఇస్తే నేరస్థులను విచారిస్తామని కూడా తెలిపారు. కానీ దానిపై ఆ తరువాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు.