Begin typing your search above and press return to search.

నీట్ వాయిదాతోనూ ఇబ్బందులున్నాయట...

By:  Tupaki Desk   |   21 May 2016 6:10 AM GMT
నీట్ వాయిదాతోనూ ఇబ్బందులున్నాయట...
X
ఐదేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్)ను వచ్చే ఏడాది వరకూ వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించడంతో ఉపశమనం లభించిందన్న వాదన వినిపిస్తున్నా అదేసమయంలో కొన్ని ఇతర సమస్యలూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చాలా రాష్ట్రాల్లో సరికొత్త సమస్యలు మొదలయ్యాయి. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే మెడికల్ నోటిఫికేషన్‌ లను జారీ చేసి సుప్రీంకోర్టు తీర్పుతో వాటిని పక్కన పెట్టేసిన సంస్థలు - రాష్ట్రాలు మరోమారు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఆంధ్రలో ఎంసెట్ రాసినపుడు ఇంత గందరగోళం లేకపోవడంతో పరీక్ష సజావుగా జరిగినా, ఫలితాలు మాత్రం వాయిదాపడ్డాయి. తెలంగాణలో మాత్రం పరీక్ష జరిగేందుకు ముందే మెడికల్ - డెంటల్ అడ్మిషన్లు ఎమ్సెట్ మెడికల్ స్ట్రీం ద్వారా జరగబోవని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఇపుడు మరోసారి ప్రవేశపరీక్ష నిర్వహించాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో మెడికల్ - డెంటల్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తాజాగా ప్రకటించారు. మరోపక్క ఈ ఏడాదే నీట్ పరీక్ష రాయక తప్పదేమోనన్న ఆతృతతో కోచింగులకు చేరిన పిల్లలంతా మళ్లీ గందరగోళంలో పడ్డారు. నీట్ పుస్తకాలను పక్కనపెట్టేసి - మళ్లీ ఎంసెట్ సిలబస్ దుమ్ము దులుపుతున్నారు.

ఇదొక్కటే కాకుండా మేనేజిమెంట్ కోటా సీట్లను ఆయా సంస్థల యాజమాన్యాలకే అప్పగించాలా? లేక ఆన్‌ లైన్‌ లో ఎంసెట్ మెడికల్ స్ట్రీం ఆధారితంగా అడ్మిషన్లు చేపట్టాలా? అనే అంశంపై అధికారులు మీమాంసలో ఉన్నారు. గత ఏడాది కూడా మెరిట్ ప్రకారమే అడ్మిషన్లు చేపట్టినట్టు యాజమాన్యాలు ప్రకటించినా, చివరికి ఇష్టారాజ్యంగానే సీట్ల భర్తీ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. యాజమాన్య కోటా సీట్లకు యాజమాన్యాల కన్సార్టియం మరో పరీక్ష నిర్వహించే యోచనలో ఉంది. అదే జరిగితే ఆంధ్ర విద్యార్థులు సైతం యాజమాన్య కోటాకు మరో పరీక్ష రాయాల్సి ఉంటుంది. తెలంగాణ విద్యార్థులు రెండు పరీక్షలు రాయాల్సి వస్తుంది. ఇదీ ప్రధాన సమస్యే.

నీట్ తప్పనిసరి అని చెప్పడంతో ఇప్పటికే తల్లిదండ్రులు వేలాది రూపాయిలు చెల్లించి ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల్లో నీట్ కోచింగ్‌ లకు చేర్పించారు. ఇపుడు ఆ ఫీజులు రాబట్టుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ దశలో ఆర్డినెన్స్ జారీ చేయడం తగదని కొంత మంది సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు. అదే జరిగితే ఈ వ్యవహారం జాప్యం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.