Begin typing your search above and press return to search.

మరో 48 గంటల్లో సంచలనాలే సంచలనాలా?

By:  Tupaki Desk   |   10 Jun 2015 10:11 AM IST
మరో 48 గంటల్లో సంచలనాలే సంచలనాలా?
X
గత పదమూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న రాజకీయ సంచలనాలకు మించిన సంచలనం రానున్న 48 గంటల్లో చోటు చేసుకుంటుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఓటుకు నోటు వ్యవహారం.. ఏపీ సీఎం ఫోన్‌ ట్యాప్‌ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని పుట్టించటం తెలిసిందే.ఈ వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి మాటా.. మాటా అనుకోవటం.. నువ్వు ఎంత అంటే.. నువ్వు ఎంత అన్న వరకూ విషయం వెల్లటం.. ఈ వ్యవహారం ఇద్దరు ముఖ్యమంత్రులు సీరియస్‌గా తీసుకొని.. తమ సత్తా ఏమిటో చాటాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా రానున్న 48 గంటల్లో తెలంగాణ ఏసీబీ అధికారులు మరిన్ని సంచలనాలు సృష్టించేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. రేవంత్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించిన క్రమంలో.. ఈ వ్యవహారంలో కీలకమైన బాస్‌తో పాటు.. మరికొందరు నేతల ప్రమేయంపై పక్కా ఆధారాలు సంపాదించామని.. రేవంత్‌కు సంబంధించిన వీడియో సాక్ష్యం ఒక్కటే కాదు.. తమ వద్ద చాలానే ఆధారాలు ఉన్నాయని చెబుతున్న విషయం తెలిసిందే.

రానున్న 48 గంటల్లో ఏపీ ముఖ్యమంత్రిని రేవంత్‌ వ్యవహారంలో బాస్‌గా వెల్లడిస్తూ.. ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసే అవకాశం బలంగా ఉందన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో ఏదైనా రాజీ ఫార్ములా గవర్నర్‌ మధ్యవర్తిగా సాగితే తప్పించి మామూలుగా అయితే.. మాత్రం చంద్రబాబు అండ్‌ కోకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. చంద్రబాబుకు నోటీసులు ఎలా జారీ చేయాలి? తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న అంశంపై తెలంగాణ ఏసీబీ అధికారులు ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారని తెలుస్తోంది. మరి.. రానున్న 48 గంటల్లో ఏ మేరకు సంచలనాలు చోటు చేసుకుంటాయో చూడాలి.