Begin typing your search above and press return to search.

హిల్ల‌రీ గెలుస్తుంద‌ని మ్యాగ‌జైన్ రెడీ చేస్తే..

By:  Tupaki Desk   |   13 Nov 2016 5:42 AM IST
హిల్ల‌రీ గెలుస్తుంద‌ని మ్యాగ‌జైన్ రెడీ చేస్తే..
X
ఉమ్మ‌డి రాష్ట్రంలో జ‌రిగిన 2004 ఎన్నిక‌ల్లోనూ తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంద‌న్న అంచ‌నాతో ఆ పార్టీకి అనుకూలంగా ఉండే ఓ ప్ర‌ధాన ప‌త్రిక అప్ప‌ట్లో ఓ ప్ర‌త్యేక సంచిక‌ను త‌యారు చేసింద‌ని.. ‘మ‌ళ్లీ చంద్రోద‌య‌మే’ అంటూ ముందే ఒక హెడ్డింగ్ కూడా రెడీ చేసుకుంద‌ని.. ఐతే వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌డంతో కంగుతిని.. ఆ సంచిక‌ల్ని ఆపించేసింద‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాల్లో ఒక చ‌ర్చ జ‌రుగుతూ ఉంటుంది. ఐతే ఆ ప‌త్రిక రెడీ చేసిన సంచిక మార్కెట్లోకి మాత్రం రాలేదు.

కానీ అమెరికా ఎన్నిక‌ల సంద‌ర్భంగా న్యూస్ వీక్ మ్యాగ‌జైన్ అయితే ఫ‌లితాల విష‌యంలో మ‌రీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ చూపించింది. ఏకంగా ‘మేడ‌మ్ ప్రెసిడెంట్’ పేరుతో.. హిల్ల‌రీ ముఖ‌చిత్రంతో మ్యాగ‌జైన్ ను రెడీ చేసింది. ఏకంగా ల‌క్షా 25 వేల కాపీలు ప్రింట్ కూడా చేసేసింది. వాటిని స్టోర్ల‌కు కూడా పంపించేసింది. రిటైల‌ర్లు ఆ సంచిక‌ల‌తో రెడీగా ఉన్నారు. రిజ‌ల్ట్ రావ‌డం ఆల‌స్యం వాటిని స్టాండ్ల‌లో పెట్టేద్దామ‌నుకున్నారు.

కానీ అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. హిల్ల‌రీ ఓడింది. ట్రంప్ గెలిచాడు. దీంతో న్యూస్ వీక్ సంస్థకు దిమ్మ‌దిరిగింది. రిటైల‌ర్ల ద‌గ్గ‌రున్న ల‌క్షా 25 వేల కాపీల్ని వెన‌క్కి తెప్పించింది. ఐతే ట్రంప్ గెలిస్తే ఆల్ట‌ర్నేట్ గా మ‌రో సంచిక కోసం కూడా స‌మాచారం ఆ మ్యాగ‌జైన్ ద‌గ్గ‌ర రెడీగా ఉండ‌టంతో ఆల‌స్యం చేయ‌కుండా ఆ సంచికను రెడీ చేసేశారు. అది ఇప్పుడు హాట్ కేక్ లాగా అమ్ముడ‌వుతోంది. తాము చేసిన త‌ప్పిదం గురించి న్యూస్ వీక్ మ్యాగ‌జైన్ ఎడిట‌ర్ హుందాగా అంగీక‌రించాడు.