Begin typing your search above and press return to search.

ఏపీ బీపీ : మ‌ళ్లీ పోలీసుల ఓవ‌ర్ యాక్ష‌న్ ? వ‌ద్దంటే విన‌రే !

By:  Tupaki Desk   |   25 April 2022 7:30 AM GMT
ఏపీ బీపీ : మ‌ళ్లీ పోలీసుల ఓవ‌ర్ యాక్ష‌న్ ? వ‌ద్దంటే విన‌రే !
X
ఒక ప్ర‌భుత్వం ప‌రువు తీయాల‌న్నా నిల‌బెట్టాల‌న్నా ర‌క్ష‌ణ మ‌రియు శాంతి భ‌ద్ర‌త‌లే కీల‌కం. కానీ ఆంధ్రావ‌ని వాకిట పోలీసులు త‌రుచూ కొన్ని విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతున్నారు. కొన్ని బాధ్య‌త లేని ప‌నులు చేస్తూ కొన్నింట అతిగా వ్య‌వ‌హరిస్తూ ఉన్న ప‌రువు కాస్త పోగొట్టుకుంటున్నారు. హ‌క్కుల కోసం నిన‌దించిన ప్ర‌తిసారీ పోలీసులు త‌మదైన క్రౌర్యంతో ఏక ప‌క్ష ధోర‌ణితో ఉద్య‌మాల‌ను అణిచివేయ‌డం త‌గ‌ద‌ని, ఆర్థికంగా భారం అనుకుంటే ఆ రోజు సీపీఎస్ ర‌ద్దుకు ఎందుకు ఒప్పుకున్నార‌ని కూడా ప్ర‌శ్నిస్తున్నాయి సంబంధిత ఉపాధ్యాయ వ‌ర్గాలు.

విజ‌య‌వాడ పోలీసులు మ‌హా స్ట్రిక్టు. అందుకే భారీ బ‌ల‌గాలు మోహ‌రించి మ‌రీ! ఉపాధ్యాయుల నిర‌స‌న‌ల‌కు అవ‌రోధాలు సృష్టిస్తున్నారు. గ‌తంలో క‌న్నా ఇప్పుడు మ‌రింత క‌టువుగా ప్ర‌వ‌ర్తించి, స్వామి భ‌క్తి చాటుకుంటున్నార‌న్న విమర్శ‌లు ఉపాధ్యాయ వ‌ర్గాల నుంచి అందుకుంటున్నారు. న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ కు ఆ రోజు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఒప్పుకున్నార‌ని., కానీ అధికారంలోకి రాగానే హౌస్ అరెస్టుల పేరిట త‌మ‌ను వేధించ‌డం త‌గ‌ద‌ని, ఈ ప్ర‌భుత్వానికి తాము బుద్ధి చెబుతామ‌ని కూడా అంటున్నారు.

గ‌తంలో పోస్ట‌ల్ బ్యాలెట్ విధానం ద్వారా తాము ప్ర‌భుత్వానికి ఎంతో మ‌ద్దతు ఇచ్చామ‌ని, కానీ ఇవాళ జ‌గ‌న్ స‌ర్కారు మాట మార్చి ఇష్టం వ‌చ్చిన రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని యూటీఎఫ్ ఆరోపిస్తోంది. తమను అగౌర‌వ ప‌రిస్తే జ‌గ‌న్ స‌ర్కారు రానున్న కాలంలో చుక్క‌లు చూడ‌డం ఖాయం అని కూడా హెచ్చ‌రిస్తోంది. ఇప్ప‌టికే కొత్త పీఆర్సీ అమ‌లు పై ఉద్యోగ మ‌రియు ఉపాధ్యాయ వ‌ర్గాలు అసంతృప్తితో ఉన్నా కూడా నెట్టుకు వ‌స్తున్నామ‌ని కానీ సీపీఎస్ ఉద్య‌మాన్ని మాత్రం ఆప‌డం సాధ్యం కాద‌ని హెచ్చ‌రిస్తూ వివిధ మార్గాల్లో త‌మ నిర‌స‌న కాండ‌ను కొన‌సాగిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ఆఫీసు వ‌ర్గాలు అప్రమ‌త్తం అయ్యాయి. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌త్యామ్నాయాలు ఆలోచించినా కూడా సీపీఎస్ ర‌ద్దు ఖ‌జానాకు భార‌మే అని తేలిపోయింది. ఇప్ప‌టికే ప‌లు విధాల ఆర్థిక భారం మోస్తున్న స‌ర్కారుకు ఉపాధ్యాయుల నిర‌స‌న‌లు కొత్త త‌ల‌నొప్పుల‌కు కార‌ణం కానున్నాయి. ఈ త‌రుణంలో మ‌ధ్యే మార్గంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఉపాధ్యాయుల‌తో కాస్త రాజీకి వ‌చ్చేందుకే ప్ర‌భుత్వం చూస్తోంది.

ఆంధ్రా పోలీసులు మ‌ళ్లీ అతి చేశారు. సీఎం క్యాంపు కార్యాల‌యాన్ని చుట్టు ముడ‌తామ‌ని ప‌ట్టుబడుతూ రోడ్డెక్కిన ఉపాధ్యాయులను పోలీసులు అతి క‌ర్క‌శంగా స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. అంతేకాదు ఎక్క‌డిక్కడ ఉపాధ్యాయుల‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు త‌మ పంతం నెగ్గించుకున్నారు. సీపీఎస్ ర‌ద్దు కోరుతూ యూటీఎఫ్ నేతృత్వాన చేప‌డుతున్న నిర‌స‌న రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు ఉద్రిక్త‌త‌ల‌కు తావిస్తోంది. గుంటూరు రైల్వే స్టేష‌న్ లో ప‌దిమందిని, విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ లో న‌లుగురిని, తెనాలిలో న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు. విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ పై నిఘా పెంచారు. క్షుణ్ణంగా త‌నిఖీలు చేస్తున్నారు.

గ‌తంలో కొత్త పీఆర్సీ అమ‌లు కోరుతూ ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి ఎంతో విజ‌యం సాధించిన ఉపాధ్యాయులు ఇప్పుడు మ‌ళ్లీ అదే క‌ద‌నోత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌యవాడ తుమ్మ‌ప‌ల్లి క‌ళాక్షేత్రం ద‌గ్గ‌ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది అని వార్త‌లు అందుతున్నాయి.