Begin typing your search above and press return to search.

ఒక అవినాశ్.. మరో కవిత.. ఈ కేసులు చెప్పేదేంటి?

By:  Tupaki Desk   |   18 March 2023 1:00 PM GMT
ఒక అవినాశ్.. మరో కవిత.. ఈ కేసులు చెప్పేదేంటి?
X
బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టాలనుకోవటం మా ఉద్దేశం కాదు. ఇక్కడ గమనించాల్సిన అంశం వేరు. అందుకే.. సంబంధం లేని రెండు కేసులకు సంబంధించి ఒకేలాంటి సారూప్యతలను ప్రస్తావించటం ఈ కథనం ప్రధాన ఉద్దేశం. జరిగిన.. జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనించినప్పుడు కొన్ని అంశాలు కొత్తగా.. సరికొత్తగా అనిపిస్తాయి. ఇప్పుడు అలాంటిదే మేం మీకు చెప్పనున్నది. ఈ రెండు కేసులు.. వాటి నేపథ్యాలు వేర్వేరుగా కనిపించినా.. వాటికి సంబంధించిన కొన్ని పోలికలు మాత్రం కనిపించటం.. తరచి చూసినప్పుడు నిజమే కదా? అన్న భావన కలుగక మానదు. అలాంటి అంశాల్ని చూస్తే..

కేసులు వేర్వేరు కానీ అభియోగాలు మాత్రం బాబాయ్ దారుణ హత్య కేసులో తీవ్రమైన అభియోగాల్ని ఎదుర్కొంటున్నారు ఏపీ అధికార పార్టీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాజాగా అభియోగాల్ని ఎదుర్కొంటున్నారు తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత ఇద్దరు అధినేతకు అత్యంత ఆప్తులు వివేకా దారుణ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి  ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరుడు. నా తమ్ముడేనయ్యా.. అంటూ ప్రజలకు చెప్పేంత సన్నిహితుడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారాలపట్టి. కొడుకు కంటే కూడా ఆమెకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారన్న మాట గులాబీ బాస్ సన్నిహితులు తరచూ ప్రస్తావిస్తుంటారు.
ఇద్దరు చట్టసభల సభ్యులే వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. తెలంగాణ శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మొదట సీన్లో లేరు కానీ..

వివేకా హత్య కేసు కావొచ్చు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కావొచ్చు.. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఈ రెండు ఉదంతాలు తెర మీదకు వచ్చినప్పుడు అటు అవినాశ్ రెడ్డి కానీ ఇటు కవిత పేర్లు  కానీ అస్సలు బయటకు రాలేదు. ఆ మాటకు వస్తే ఎలాంటి సందేహాలు చోటు చేసుకున్నది లేదు. అనూహ్యంగా మధ్యలో ఎంట్రీ వివేకా హత్య కేసులో ఇప్పుడు పీకల్లోతు కష్టాలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ రెడ్డి కానీ..  ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇబ్బందులు పడుతున్న కవిత కానీ.. ఈ కేసుల మొదట్లో వీరి పేరు వినిపించకపోవటమే కాదు.. ఇద్దరు మధ్యలోనే ఎంట్రీ ఇవ్వటం.. వీరిద్దరి పాత్ర అనూహ్యంగా తెర మీదకు వచ్చింది.

రెండింటిలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థలే కీలకం వివేకా హత్య కేసు విచారణను సీబీఐ చేపట్టటం తెలిసిందే. ఈ కేసు విచారణ విషయంలో సీబీఐ మొదట్లో నిదానంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత మాత్రం వేగం పుంజుకోవటం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ కూడా కేంద్ర విచారణ సంస్థ అయినా ఈడీ చేపట్టటం తెలిసిందే. ఈ రెండు కేసుల్లోనూ కేంద్ర దర్యాప్తు సంస్థలే కీలకంగా మారటం గమనార్హం. పలువురు అరెస్టుల అనంతరమే వివేకా హత్య కేసులోనూ.. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ తొలుత పలువురి అరెస్టులు చోటు చేసుకున్నాయి. విచారణ నెలల పాటు సాగిన తర్వాతే.. ఈ కేసులకు సంబంధించి ఎంపీ అవినాశ్.. ఎమ్మెల్సీ కవితల పేర్లు బయటకు వచ్చాయి.

నెలల తర్వాతే నోటీసులు ఈ రెండు సంచలన ఉదంతాల్లో పాత్ర ఉందంటూ దర్యాప్తు సంస్థలు నెలల తర్వాతే అవినాశ్ కు కానీ కవితకు కానీ నోటీసులు ఇవ్వటం కనిపిస్తుంది. విచారణకు తొలుత రాలేమంటూ.. రెండు ఉదంతాల్లోనూ నోటీసులు అందుకున్న వెంటనే విచారణకు వెళ్లింది లేదు. విచారణకు తాము రాలేమని.. వాయిదా వేయాలని కోరటం కనిపిస్తుంది. విచారణ వేళ హైడ్రామా సీబీఐ విచారణ వేళలోనూ.. ఈడీ విచారణ ఎదుట హాజరైన రెండు సందర్భాల్లోనూ హైడ్రామా చోటు చేసుకోవటం.. విచారణకు మీడియాలో ఎంతటి ప్రాధాన్యత లభించిందన్నది తెలిసిందే.

విచారణపైనా ఆరోపణలు ఆసక్తికరంగా ఈ రెండు కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ప్రముఖులు.. తమను విచారణ చేపట్టిన విచారణ సంస్థల మీద ఆరోపణలు చేయటం కనిపిస్తుంది. అవినాశ్ రెడ్డి అయితే సీబీఐ మీద ఎంతటి ఘాటు ఆరోపణలు చేశారో తెలిసిందే. లిక్కర్ స్కాం ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత  సైతం తనను విచారించిన ఈడీ మీద ఆరోపణలు చేయటం కనిపిస్తుంది. మాకే పాపం తెలీదు దర్యాప్తు సంస్థల విచారణ వేళలోనూ.. కోర్టును ఆశ్రయించిన వేళలోనూ తమకు ఎలాంటి పాత్ర లేకున్నా.. ఇందులో తమను ఇరికించారన్న మాట ప్రముఖుంగా వినిపించటం గమనార్హం. గంటల కొద్దీ విచారణ ఈ రెండు ఉదంతాలకు సంబంధించి విచారణ సంస్థలు ఈ ప్రముఖులను గంటల కొద్దీ విచారించటం.. ఒకసారి విచారణ అయ్యాక మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పటం కనిపిస్తుంది.

సాక్ష్యాధారాల్ని ధ్వంసం చేసిన ఆరోపణ రెండు సంచలన ఉదంతాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు ప్రముఖుల మీద ఆసక్తికరంగా ఒకేలాంటి ఆరోపణలు ఉన్నాయి. వివేకా హత్య అనంతరం అక్కడి సాక్ష్యాధారాల్ని ధ్వంసం చేశారన్న ఆరోపణను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఉన్న కవిత.. తాను ఉపయోగించే స్మార్ట్ ఫోన్లను పెద్ద ఎత్తున ధ్వంసం చేశారని.. తద్వారా ఆధారాల్ని చిక్కకుండా ఉండేలా ప్రయత్నాలు చేశారన్న ఆరోపణ ఉండటం తెలిసిందే. దర్యాప్తు సంస్థల మీదే ఆరోపణలు తమను విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థల తీరుపైనా ఈ ఇద్దరు ప్రముఖులు ఆరోపణలు చేయటం గమనార్హం. సుప్రీం కోర్టును ఆశ్రయించటం వీరిద్దరు తమను విచారణను అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించటం కనిపిస్తుంది. ఇద్దరిది అరెస్టు ఆందోళనే ఈ ఇద్దరు ప్రస్తుతం అరెస్టు ఆందోళనను ఎదుర్కొంటున్న వారే. వీరిని విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు వీరిని త్వరలోనే అరెస్టు చేయొచ్చన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.