Begin typing your search above and press return to search.

మేనమామకే డౌట్ కొడుతోందా... ఇలాగైతే వైసీపీకి ఎలా...?

By:  Tupaki Desk   |   4 Dec 2022 1:30 AM GMT
మేనమామకే డౌట్ కొడుతోందా... ఇలాగైతే వైసీపీకి ఎలా...?
X
ఆయన ఎవరో కాదు, జగన్ సొంత మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి. కడప జిల్లా లాంటి కంచుకోటలో ఆయన కమలాపురం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మొదటి సారి కేవలం అయిదు వేలు మాత్రమే మెజారిటీ వస్తే రెండవసారి ఏకంగా 27 వేల ఓట్లు సాధించారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయనకే టికెట్. ఇందులో ఏ రకమైన సందేహం ఎవరూ పడాల్సింది లేదు.

జగన్ మేనమామకు కచ్చితంగా టికెట్ ఇస్తారు. మరి కధ అంతవరకూ ఓకే కానీ పోటీ చేయడానికి ఆయన తయారుగా ఉన్నారా అన్నదే చర్చ. వచ్చే ఎన్నికల్లో కమలాపురం నుంచి పోటీ చేయడానికి రవీంద్రనాధ్ రెడ్డి అనాసక్తిని చూపిస్తున్నారు అని ప్రచారంలో ఉన్న మాట. జగన్ గడపగడపకు కార్యక్రమంలో ఆయన పాలు పంచుకుంటున్నారు ఇంటింటికీ తిరిగి వైసీపీ పధకాల గురించి చెబుతున్నారు.

అయినా కానీ ఆయన పోటీ చేయడం మీద మాత్రం ఆలోచిస్తున్నారుట. దానికి కారణాలు ఏంటి అంటే యాంటీ సెంటిమెంట్ వల్లనే ఆయన ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికి మూడు సార్లు వరసబెట్టి గెలిచిన వారు చరిత్రలో ఎవరూ లేరుట. 1985, 1989లో రెండు సార్లు ఎమ్మెల్యే అయిన మైసూరారెడ్డి 1994 వచ్చేసరికి ఓటమి పాలు అయ్యారు. అలాగే 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ తరఫున పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన వీరశివారెడ్డి కూడా 2014 ఎన్నికల్లో టికెట్ దక్కక పోటీ చేయలేకపోయారు. హ్యాట్రిక్ విక్టరీని ఆయన సొంతం చేసుకోలేకపోయారు.

ఇపుడు చూస్తే మూడవసారి విజయం సాధయ్మేనా అన్న డౌట్ అయితే రవీంద్రనాధ్ రెడ్డిలో ఉంది అంటున్నారు. పైకి అంతా బాగా ఉన్నట్లుగా కనిపిస్తున్నా టీడీపీ కూడా అక్కడ గట్టిగా ఉంది. 2019 లో వైసీపీలో ఉండి ఆ పార్టీ విజయానికి హెల్ప్ చేసిన వీరశివారెడ్డి ఇపుడు టీడీపీ వైపు ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నారు. పైగా ఆయనకంటూ బలమైన వర్గం ఉంది. ఇక టీడీపీకి ఇటీవల కాలంలో ఈ నియోజకవర్గంలో ఆదరణ పెరుగుతోంది.

దాంతో మూడసారి పోటీకి రవీంద్రనాధ్ రెడ్డి విముఖత చూపిస్తున్నారు అని అంటున్నారు. పైగా ఆయన తనకు వేరే నియోజకవర్గం కేటాయించాలని అధినాయకత్వాన్ని కోరినట్లుగా చెబుతున్నారు. కడప అసెంబ్లీ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే ఆయనకు రెండవసారి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వమని ముందే చెప్పారని అంటున్నారు. దాంతో ఆ సీటు మీద మేనమామ కన్నేసి తనను అక్కడికి షిఫ్ట్ చేయమని కోరుతున్నారుట. ఇక ఇదే సీటు మీద పార్టీలోని బలిజ సామాజికవర్గం నేతలు కూడా దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు తమవే ఉన్నాయని కానీ టికెట్ మాత్రం మైనారిటీలకు ఇస్తున్నారని ఆ మధ్యన వారంతా ఆవేదన వ్యక్తం చేసిన సనతి విధితమే.

వారిలో నుంచి ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. సామాజిక సమీకరణలు దృష్ట్యా అది అనివార్యం అంటున్నారు. పైగా జనసేన రేసులో ఉంది కాబట్టి వారి వాయిస్ ఇంకా గట్టిగా పెరుగుతోంది. మరి ఈ టైం లో మేనమామ ఇక్కడ సీటు కోసం రెడీ అయితే జగన్ ఇస్తారా అన్నది చర్చగా ఉంది. మరి అక్కడ టికెట్ తెచ్చుకున్నా బలిజలు అసంతృప్తికి లోను అయితే మైనారిటీలు భాషా కారణంగా మౌనం దాలిస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో అన్న కంగారు కూడా ఉంటుంది. ఏది ఏమైనా కమలాపురం వీడి మేనమామ ఎందుకు వస్తున్నట్లు అన్నదే పెద్ద చర్చ. మరి ఆయనకే డౌట్ కొడితే వైసీపీకి కడప గడపలో బిగ్ ట్రబుల్స్ తప్పవా అంటే జవాబు ఇపుడే ఎవరూ చెప్పలేరు అంతే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.