Begin typing your search above and press return to search.

మోడీ విత్ జగన్ : అజెండా లో విశాఖ‌...?

By:  Tupaki Desk   |   28 April 2022 1:30 PM GMT
మోడీ విత్ జగన్ : అజెండా లో విశాఖ‌...?
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకే నెలలో రెండు సార్లు ప్రధానిని కలిసే అరుదైన సందర్భం ఇది. ఈ నెల 29న జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఇక ఢిల్లీలో జగన్ 29న రాత్రికి ప్రధాని నరేంద్రమోడీని కలుస్తారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు అయింది అంటున్నారు.

వాస్తవానికి ఈ నెల 30న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన జ్యూడీషియల్ ఇంఫ్రాస్ట్రక్చర్ సదస్సు జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హై కోర్టు ప్రధాన నాయమూర్తులు హాజరవుతున్నారు. జగన్ కూడా ఇదే పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నారు.

ఒక రోజు ముందుగా ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలవాలన్నదే సీఎం టూర్ లో విశేషంగా చూడాలి. ఇక మరోమారు మోడీతో భేటీ సందర్భంగా జగన్ ఆయనతో ఏ అంశాలను చర్చిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు అనేక కీలక రాజకీయ పరిణామాలు కూడా జగన్ చర్చలో రావచ్చు అని అంటున్నారు.

మరో రెండేళ్లలో ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఈ భేటీరో పలు రాజకీయ అంశాలే చర్చకు వస్తాయని అంటున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకోవాలన్నది జగన్ ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారానికి హైకోర్టు తుది తీర్పు తెర దించేసింది.

దాంతో కేంద్రం తలచుకుంటేనే ఏమైనా జరిగేది అన్న అభిప్రాయం ఉంది. ఈ నెల మొదటి వారంలో జగన్ ఢిల్లీ వెళ్ళినపుడు కూడా ఈ అంశం కదిపి ఉంటారు అని ప్రచారం సాగింది. ఇపుడు మరోమారు విశాఖ రాజధాని విషయం మీద ప్రధాని మోడీకి జగన్ వివరిస్తారు అని అంటున్నారు. పార్లమెంట్ తలచుకుంటేనే చట్టంలో మార్పులు చేసుకోవచ్చు అని హై కోర్టు తుది తీర్పులో చెప్పినందువల్ల కేంద్రం సానుకూలంగా వ్యవహరిస్తే మూడు రాజధానుల కల నెరవేరుతుంది అన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.

మరి కేంద్రం ఈ విషయంలో ఎంత వరకూ సానుకూలంగా ఉంటుంది. ఏ మేరకు మద్దతు ఇస్తుంది అన్నది చూడాలి. ఏపీలో బీజేపీ అయితే ఇప్పటికే అమరావతి ఏకైక రాజధాని అన్న స్టాండ్ ని తీసుకుంది. దానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ మధ్య తిరుపతి వచ్చినపుడు ఇచ్చిన డైరెక్షన్ కారణం అని కూడా ప్రచారం సాగింది.

మరి తన పార్టీ వైఖరికి భిన్నగా మూడు రాజధానులకు కేంద్రం పచ్చ జెండా ఊపుతుందా అన్నది కేలకమైన ప్రశ్న. అయితే వైసీపీ మద్దతు రేపటి రోజుల్లో మరింత అవసరం పడుతున్న నేపధ్యంతో పాటు రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్న లాజిక్ పాయింట్ ని కనుక దృష్టిలో ఉంచుకుంటే వైసీపీ ఆశలను కూడా కొట్టి పారేయలేము. మొత్తానికి మోడీ విత్ జగన్ అజెండా లో కీలకం విశాఖే అవుతుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.